జాతీయ రహదారిపై డ్రోన్ సంచారం ఇలా ఉంటుంది
కర్ణాటక: రోడ్డు ప్రమాదాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో వాహనదారుల వేగానికి అడ్డుకట్ట వేసేందుకు రోడ్డు భద్రత ట్రాఫిక్ విభాగం పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్ వే జాతీయ రహదారితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ రహదారుల్లో డ్రోన్ కెమెరాలను వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటికే బెంగళూరు నగరంలో ట్రాఫిక్ నిర్వహణకు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తుండగా జాతీయ, రాష్ట్ర రహదారుల్లో కూడా వాటిని ఏర్పాటు చేస్తారు. జాతీయ రహదారుల్లో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసినా, పరిమితికి మించి అతివేగంగా సంచరించినా డ్రోన్ కెమెరాలు గుర్తిస్తాయి. అనంతరం ఆ వాహనాన్ని టోల్ వద్ద అడ్డుకుని జరిమానా విధిస్తారు. పలు జిల్లాల్లో 2 కోట్ల విలువ చేసే డ్రోన్ కెమెరాల సరఫరాకు సంబంధించి పోలీస్ శాఖకు రోడ్డు భద్రత సంచార విభాగం ప్రతిపాదనలు అందజేసింది
డ్రోన్ వినియోగం ఎందుకంటే...
9 నెలల అవధిలో బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే రహదారిలో 590 ప్రమాదాలు సంభవించగా సుమారు 158 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదాలకు అతివేగంతో కూడిన డ్రైవింగ్ ప్రధాన కారణమని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. ఈనేపథ్యంలో అతివేగానికి అడ్డుకట్ట వేయాలని రోడ్డు సురక్షత సంచార విభాగం ఏడీజీపీ అలోక్‌కుమార్ నిర్ణయించారు.
దత్తపీఠ రోడ్డులో డ్రోన్ ప్రయోగం విజయవంతం
చిక్కమగళూరు జిల్లా ముళ్లయ్యనగరికి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ నిర్వహణ కోసం చేపట్టిన డ్రోన్ వినియోగం విజయవంతమైంది. ఈ రోడ్డులో వాహనాల రద్దీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య తెలుసుకుని డ్రోన్ వినియోగించి ట్రాఫిక్ నిర్వహణ ప్రారంభించగా, అది విజయవంతమైంది.
ఎక్కడెక్కడ డ్రోన్ల వినియోగం.?
బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్ వే, తుమకూరు–చిత్రదుర్గ, ఉడుపి–మంగళూరు, ధార్వాడ–బెళగావి జాతీయ రహదారుల వద్ద డ్రోన్లు వినియోగించాలని నిర్ణయించారు.
డ్రోన్ ఎలా వినియోగిస్తారంటే...
జాతీయ రహదారుల్లో టోల్‌గేట్ లేదా రహదారుల మధ్య డ్రోన్ కెమెరాలు విహరిస్తాయి. ఈ రహదారుల్లో అతివేగంగా సంచరించే వాహనాల ఆచూకీ కనిపెట్టి ఈ సమాచారం టోల్‌గేట్ వద్ద గల ట్రాఫిక్ పోలీసులకు చేరవేస్తారు. ఆ వాహనాన్ని టోల్ వద్ద అడ్డుకుని నిబంధనల ఉల్లంఘనలపై వాహన దారులకు జరిమానా విధిస్తారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment