కర్ణాటక: కుమారుడు, వరుణ మాజీ ఎమ్మెల్యే యతీంద్ర వ్యాఖ్యలతో తండ్రి, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తిప్పలు వచ్చి పడ్డాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిద్ధరామయ్య గెలిచేందుకు వేలాది మందికి కుక్కర్లు, ఇసీ్త్ర పెట్టెలను పంపిణీ చేసినట్లు యతీంద్ర ప్రకటించడమే ఇందుకు కారణం. గత శుక్రవారం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలో మడివాళ సముదాయ భవనం ప్రారంభోత్సవంలో యతీంద్ర పాల్గొని ప్రసంగించారు. కుక్కర్లు, ఐరన్ బాక్సులను పంచి మడివాళ సముదాయ ఓట్లను పొందేందుకు తండ్రి సిద్ధరామయ్య కృషిచేశారని అర్థం వచ్చేలా మాట్లాడారు.
వాటి పంపిణీ రెండు, మూడుసార్లు వాయిదా పడినప్పటికీ తన తండ్రి పట్టు విడవకుండా ఓటర్లకు అందజేశారని ఆయన చెప్పారు. వరుణ నియోజకవర్గంలో మడివాళ సముదాయ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నంజప్ప సమక్షంలో వేలాదిమందికి తన తండ్రి పంపిణీ చేశారని చెప్పారు. తండ్రిని గెలిపించినందుకు మీ రుణం తీర్చుకుంటామని అన్నారు. యతీంద్ర మాట్లాడిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓటర్లకు డబ్బు, ఇతర తాయిలాలు పంచడం అక్రమమన్నది తెలిసిందే.
వివరణతో సర్దుబాటుకు యత్నం
యతీంద్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. బీజేపీ, జేడీఎస్‌లు ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని సిద్ధరామయ్యపై న్యాయ పోరాటం చేయవచ్చని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం నేరం, అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుంది. ఈ ఉల్లంఘన ఆరోపణలు నిరూపితం అయితే ఆరేళ్ల పాటు ఎన్నికల సంఘం నిషేధం విధిస్తుంది. యతీంద్ర వ్యాఖ్యలు ఇబ్బందిగా మారడంతో వెంటనే ఆయన వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారు. మడివాళ సమావేశంలో బహుమతులు పార్టీ నుంచి కానీ, లేదా తమ వైపు నుంచి కానీ ఇవ్వలేదని చెప్పారు.
బీజేపీ మండిపాటు
కుక్కర్ల గురించి బీజేపీ నాయకులు మాట్లాడుతూ సిద్దరామయ్య ప్రజలకు తప్పుడు హామీలనిచ్చి కుక్కర్, ఐరన్ బాక్స్‌ల ఆశలు చూపి ఓట్లు పొందారు, ఎన్నికల నియమాలను ఉల్లంఘించి గెలిచారు, అందుచేత ముఖ్యమంత్రి పదవికి అనర్హత ఒక్కటే ఆయన ముందున్న దారి అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment