కోలారు: మైనర్ బాలున్ని మరో మైనర్ బాలుర గుంపు చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కోలారు నగరంలోని పీసీ కాలనీలో చోటు చేసుకుంది. సోషల్ మీడియా దుష్ప్రభావం, బాలలు, యువతలో పెరుగుతోన్న నేర ప్రవృత్తికి ఈ హత్య అద్దం పడుతోంది. కోలారు శాంతి నగర్‌కు చెందిన కార్మికుడు అరుణ్, సుశీల కుమారుడు కార్తీక్ సింగ్ (17) హత్యకు గురైన బాలుడు.
వివరాలు.. కార్తీక్‌సింగ్ నగరంలోని కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాడు. పీసీ కాలనీకి చెందిన మరో మైనర్ బాలునికి కార్తీక్‌సింగ్‌తో గొడవలు ఉన్నాయి. నిందితుడు, అతని స్నేహితులు కార్తీక్ సింగ్‌కు పుట్టిన రోజు పార్టీ ఉందని చెప్పి తెలిపి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలోకి పిలిపించారు. అక్కడ అతన్ని తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. కత్తితో గొంతు కోసి పరారయ్యారు. రక్తపుమడుగులో మృతదేహం పడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి.
నిందితుని నేరాల బాట
వేమగల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీస్ మురుగన్ కుమారుడు దిలీప్ అలియాస్ షైన్ సూత్రధారి అని ప్రచారం సాగుతోంది. దిలీప్ గత ఫిబ్రవరి నెలలో కూడా ఒకసారి కత్తితో ఒకరిపై దాడి చేశాడు, దీనిపై కోలారు నగర పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు కాగా, పోలీసు కొడుకే అని సర్దిచెప్పి పంపారు. ఇతడు గంజాయికి బానిసై స్నేహితులతో కలిసి దౌర్జన్యాలు చేసేవాడు. సుమారు 8 నెలల కిందట కూడా కార్తీక్ సింగ్‌ని తీవ్రంగా కొట్టి వీడియోలు తీసి వైరల్ చేశారు.
పోలీసుల గాలింపు
పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఎస్‌ఎన్‌ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. హంతకులు పరారీలో ఉండి వీరిని అరెస్టు చేయడానికి పోలీసులు 3 తనిఖా బృందాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.
కఠినంగా శిక్షించాలి: కార్తీక్ తల్లి
నా కుమారున్ని ఆ దుండగులే పిలుచుకుని వెళ్లారు. నేను కొంతసేపటికి కార్తీక్ మొబైల్‌కు ఫోన్ చేసినప్పుడు స్విచాఫ్ వచ్చింది. కార్తీక్‌ను ఎవరో కొట్టి చంపారని తరువాత మాకు తెలిసినవారు చెప్పారు. హంతకులకు కఠిన శిక్షలు విధించాలి.
Comments
Please login to add a commentAdd a comment