దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకోగా త్వరలో కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పింనున్నట్టు పోలీసుల సమాచారం. దర్శన్‌తో పాటు మొత్తం 17మంది నిందితుల మొబైల్ ఫోన్లలోని డాటాను రిట్రీవ్ చేస్తున్న పోలీసులు అది పూర్తయితే త్వరలో చార్జ్‌షీట్ తయారు చేయనున్నారు. సీఐడీ టెక్నికల్ సెల్‌లో డిజిటల్ సాక్ష్యాల సేకరణ జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.
జైలు మార్పు అధికారుల నిర్ణయం: హోంమంత్రి
దర్శన్‌ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తుమకూరు జిల్లా జైలుకు మార్చాలనేది జైలు అధికారుల నిర్ణయమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని హోంమంత్రి జీ పరమేశ్వర్ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన నిందితులు అందరూ ఒకే చోట ఉండడం మంచిది కాదని జైలు అధికారులు భావించారన్నారు. దర్శన్, మరో ముగ్గురిని తుమకూరు జైలుకు తరలిస్తారని తెలిసిందన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది తనకు తెలియదని, అది హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.
నటి పవిత్రగౌడకు రూ. 2 కోట్లు!
ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దర్శన్ అభిమాని అరెస్టు
యశవంతపుర: నిర్మాత ఉమాపతిగౌడను అంతు చూస్తానని బెదిరించిన నటుడు దర్శన్ అభిమాని చేతన్‌ని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దర్శన్ గురించి ఉమాపతి చెడుగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చేతన్ బెదిరించాడు. దీంతో ఫిర్యాదు రాగా అరెస్టు చేసి మళ్లీ విడుదల చేశారు.
సీఎంను కలిసిన రేణుకాస్వామి తల్లిదండ్రులు
శివాజీనగర: హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment