మారెమ్మదేవికి ప్రత్యేక అలంకరణ
బొమ్మనహళ్లి : కార్తీకమాసం శుక్రవారం సందర్భంగా బొమ్మనహళ్లి నియోజకవర్గం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ వార్డు పరంగిపాళ్య గ్రామంలో గ్రామ దేవత మారెమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. అర్చకులు వినయ్ కుమార్ దీక్షిత్ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మహామంగళహారతీ ఇచ్చారు. భక్తులు దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
స్నేహితుడి పట్ల అమానుషం
●ఫినాయిల్ తాగిన యువకుడు
దొడ్డబళ్లాపురం: లేటెస్ట్ డిజైన్ ప్యాంట్ ధరించిన యువకుడి పట్ల స్నేహితులు అమానుషంగా వ్యవహరించి అవమానకరంగా కామెంట్ చేయడంతో బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మంగళూరులో చోటుచేసుకుంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త రకం డిజైన్ ప్యాంట్ ధరించిన యువకుడు బెళ్తంగడి సంతెకట్టకు వచ్చాడు. ఈక్రమంలో స్నేహితులు శబీర్, అనీశ్, సలీం అనే యువకులు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా ప్యాంట్‌ను గోనెసంచి దబ్బలంతో కుట్టి వీడియో తీసి అవమానించారు.మనస్తాపం చెందిన యువకుడు ఇంటికి వెళ్లి ఫినాయిల్ తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. యువకుడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.
వక్ఫ్‌బోర్డు తీరుపై నిరసన
శివాజీనగర: రైతుల భూములు, పాఠశాలలు, ఆలయాల ఆస్తులను ప్రభుత్వం వక్ఫ్ బోర్డు పరం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు శుక్రవారం కొనసాగాయి. బెంగళూరు నగరంలోని ఫ్రీడం పార్కులో జరిగిన ధర్నాలో శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడారు. వక్ఫ్ చట్టానికి సంబంధించి తక్షణమే గెజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక సముదాయాన్ని మెప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ వక్ఫ్‌బోర్డుకు వంద పాడుతోందన్నారు. ఆలయాలు, మఠం ఆస్తులు కూడా వక్ఫ్‌బోర్డువేనని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. వక్ఫ్‌బోర్డు చట్టాన్ని రద్దు చేయకపోతే మున్ముందు అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. మఠం స్వామీజీలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి శోభాకరంద్లాజె, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment