బెంగళూరు అభివృద్ధికి భారీగా నిధులివ్వండి
శివాజీనగర: బెంగళూరు మహానగర అభివృద్ధి దృష్టితో ఎమ్మెల్యేలకు అధిక నిధులను ఇవ్వాలని, బడ్జెట్‌లో 6 వేల నుంచి 8 వేల కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రాన్ని సమర్పించినట్లు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర తెలిపారు. శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు మహానగర అభివృద్ధికి బీబీఎంపీకి రూ. 6 వేల నుంచి రూ.8 వేల కోట్ల నిధులను బడ్జెట్‌లో ఇచ్చేవారని, రెండేళ్ల నుంచి ప్రస్తుత ప్రభుత్వం బెంగళూరు అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
నేటి నుంచి చలనచిత్రోత్సవం
యశవంతపుర: బెంగళూరులో శనివారం నుంచి 16వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం కానుంది. ఈ సారి సుమారు 4 వందల సినిమాలు ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ప్రముఖ నటుడు కిశోర్‌కుమార్‌ను రాయబారిగా నియమించారు. మార్చి ఒకటి నుంచి 8 వరకు బెంగళూరు చలనచిత్రోత్సవం జరుగునుంది. ప్రారంభ కార్యక్రమానికి కర్ణాటక చలనచిత్ర ఆకాడమీ అధ్యక్షుడు సాధుకోకిల, మంత్రి ప్రియాంక్ ఖర్గేను అహ్వనించారు. సినిమా రంగంపై ఏఐ ప్రభావం ఉన్నందున ప్రత్యేకంగా నిపుణులను రప్పించి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ఎడాదికి సర్వ జనాంగద శాంతియ తోట సినిమాను ఎంపిక చేశారు. చలనచిత్రోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 9 కోట్లను ఖర్చు చేయనుంది. 60 దేశాలకు చెందిన 2 వందలకు పైగా సినిమాలు 13 థియేటర్లలో 4 వందల ప్రదర్శనలు చేయనున్నారు. ప్రతి షోను లక్షమందికీ పైగా వీక్షించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
ఇడ్లీ హోటల్స్‌పై ఆరోగ్యశాఖ అధికారుల దాడి
బనశంకరి: ఇడ్డీలను తయారు చేసేందుకు ప్లాస్టిక కవర్లు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం బెంగళూరు నగరంలో పలు హోటల్స్‌లో తనిఖీలు చేశారు. ఇడ్లీ తయారీకి నిబంధనల ప్రకారం తెల్లటి నూలు బట్టను వినియోగిస్తున్నారా లేదా, అనారోగ్యాలకు కారణమయ్యే ప్లాస్టిక్ కవర్ వినియోగిస్తున్నారా అని ఆరా తీశారు. ఇడ్లీ తయారుచేసే హోటల్స్, పాస్ట్‌పుడ్‌సెంటర్లు, పుట్‌పాత్‌లపై తయారుచేసే ఇడ్లీ తోపుడుబండ్ల నుంచి శాంపిల్స్ ను సేకరించారు.
డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య
యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లా సుళ్యలో డెంటల్ విద్యార్థిని ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. బెళగావికీ చెందిన కృతికా నడోణి(21) మంగళూరు పట్టణంలోని ప్రైవేట్ డెంటల్ కాలేజీలో చదువుతూ సుళ్యలోని హాస్టల్‌లో ఉంటుంది. ఈ నెల 26న రాత్రి 7 గంటల సమయంలో హాస్టల్‌లోని తాను ఉంటున్న రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఎవరికో ఫోన్ చేసినట్లు సమాచారం.పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment