బనశంకరి: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. చిక్కబళ్లాపుర తాలూకా వరదహళ్లిలో బర్డ్‌ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టింది. గ్రామానికి చెందిన ద్యావప్ప, రత్నమ్మ పెంచిన 36 కోళ్లు గత శనివారం రాత్రి ఉన్నఫళంగా మృతిచెందాయి. విషాహారం తినడం లేక ఏదైనా రోగంతో మృతిచెందాయా అని తెలుసుకోవడానికి శాంపిల్స్ సేకరించి బెంగళూరు, బోపాల్ ల్యాబోరేటరీకి పంపించారు. నివేదిక గురువారం జిల్లా అధికారయంత్రాంగం, పశుసంవర్దకశాఖకు అందింది. బర్డ్‌ప్లూతో కోళ్లు మృతి చెందినట్లు జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మహేశ్ తెలిపారు. దీంతో కోళ్లఫారాల యజమానులు రాత్రికి రాత్రి 10 వేల కోళ్లను బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. కలెక్టర్ నేతృత్వంలో ఆరోగ్యశాఖ, పశుసంవర్దకశాఖ అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. బర్డ్‌ప్లూ నియంత్రణకు అనుసరించాల్సిన కట్టుదిట్టమైన చర్యలు ముందుజాగ్రత్తచర్యలపై చర్చించారు. గ్రామానికి కిలోమీటరు పరిధిలో కోడి మాంసం విక్రయం, సేవనం నిషేధిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో బర్డ్‌ప్లూ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో చిక్కబళ్లాపుర జిల్లాకు ఈ రాష్ట్రాల వాహనాలు ప్రవేశించకుండా నిఘాపెట్టాలని జిల్లా ఆరోగ్యశాఖ సూచించింది. బర్డ్‌ప్లూతో కేవలం కోళ్లు మాత్రమే మృతిచెందాయి. ప్రజలకు ఎలాంటి హాని జరగలేదని అధికారులు ప్రకటించారు. గ్రామీణ ప్రదేశాల్లో ఆరోగ్యశాఖ కు సంబందించి ఆశాకార్యకర్తలు, ఆరోగ్యశాఖసిబ్బంది ఇంటింటికి వెళ్లి గ్రామీణప్రదేశాల్లో విస్త్రృతంగా జాగృతం చేస్తున్నారు. వరదహళ్లి లో కోళ్లను సామూహికంగా వధించాలని నిర్ణయించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని కోళ్లను 15 రోజుల్లోగా మరోసారి పరీక్షలు చేపట్టాలని తీర్మానించారు.
36 కోళ్లు మృత్యవాత
జిల్లా వ్యాప్తంగా అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment