శివాజీనగర: ఏడో వేతన కమిషన్ నివేదిక జారీతో పాటు వివిధ డిమాండ్లను పరిష్కరించాలని ఒత్తిడి చేస్తూ కర్ణాటక రిటైర్డ్ ఉద్యోగుల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక ధర్నాను రిటైర్డ్ లోకాయుక్త న్యాయమూర్తి సంతోష్ హెగ్డే ప్రారంభించారు. నగరంలోని స్వాతంత్య్ర ఉద్యానవనంలో రిటైర్డ్ ఉద్యోగుల వేదిక రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ ఎం.పీ.ఎం షణ్ముఖయ్య ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. గత 2002 జూలై నుంచి 2024 జూలై మధ్య కాలావధిలో రిటైర్డ్ అయిన అధికారులు, ఉద్యోగులకు ఎలాంటి నియమాలతో 6వ వేతన కమిషన్ సదుపాయాలను ఇచ్చారో ప్రస్తుతం 7వ వేతన కమిషన్ ప్రకారం రిటైర్డ్ సదుపాయాలు ఇవ్వటానికి పరిష్కార ఆదేశాలు జారీ చేయాలని పోరాటం చేపట్టామన్నారు. ఈ పోరాటం అత్యంత నిర్ణయాత్మకమైందన్నారు. రాష్ట్రంలో 28 మంది మంత్రులు తమ డిమాండ్లపై స్పందిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయితే ఫిబ్రవరి 20న మంత్రి మండలి సమావేశంలో ఈ విషయం చర్చకు రాకపోవటంతో నిరవధిక సమ్మె చేపడుతున్నామన్నారు. ఏ కారణానికి వెనుకంజ వేయం. రిటైర్డ్ అయిన తాము ఇంట్లో ఉండటం కంటే ఫ్రీడం పార్కులో పోరాటం చేయటమే మేలన్నారు. అన్ని జిల్లాల నుంచి వేలాది మంది ఉద్యోగులు కుటుంబ సమేతంగా పోరాటంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వేదిక నాయకులు అశోక్, సజ్జన, శంకరప్ప లమాణి, ఎస్.జీ.బిసిరొట్టి, మహాంతేశ్ వీ.హిరేమఠ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment