శ్రీనివాస రథోత్సవం
మైసూరు: జిల్లాలోని సాలిగ్రామ తాలూకా దొడ్డహనసోగె గ్రామంలోని శ్రీనివాస స్వామి బ్రహ్మరథోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. పవిత్ర కావేరి నది వద్ద వెలసిన ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఎమ్మెల్యే డీ.రవిశంకర్ రథానికి పూజలు చేయడం ద్వారా శ్రీకారం చుట్టారు. రథోత్సవం నేపథ్యంలో ఆలయంలో తెల్లవారుజాము నుంచే హోమాలు జరిగాయి. రథంలో శ్రీనివాస స్వామి వారిని ప్రతిష్టించి భక్తులు గోవింద.. గోపాల..అని నినాదాలు చేస్తూ లాగారు. మహిళా భక్తులు రథవీధిని శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి రథానికి స్వాగతం పలికారు. తహసీల్దార్ నరగుంద, ఇన్‌స్పెక్టర్ కృష్ణరాజు తదితరులున్నారు.
నట్లు, బోల్టులకు
రమ్య మద్దతు
యశవంతపుర: సినిమా రంగం వాళ్లకు నట్లు బోల్టులను బిగిస్తానంటూ డీసీఎం డీకే శివకుమార్ చెప్పిన మాటలను కొందరు వ్యతిరేకిస్తే, కొందరు సమర్థిస్తున్నారు. ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య.. డీకేని సమర్థిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. నట్లు, బోల్టులు సరి చేస్తామని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. సినిమా రంగం ప్రజలపై మంచి ప్రభావం చూపిస్తుంది. గోకాక్ పోరాటానికి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మద్దతు ఇచ్చిన సంగతిని సినిమా రంగం మరువరాదని ఆమె ఇన్‌స్టా లో పోస్టు చేశారు.
డీసీఎంది అహంకారం: యదువీర్
దొడ్డబళ్లాపురం: సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ల నట్లు, బోల్టులు బిగిస్తానంటూ డీసీఎం డీకే శివకుమార్ అధికార మదాన్ని ప్రదర్శించారని మైసూరు బీజేపీ ఎంపీ యదువీర్ ఆరోపించారు. హాసన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన సినిమా ఆర్టిస్టులు ప్రైవేటు వ్యక్తులని, ఏ కార్యక్రమంలో పాల్గొనాలి, వద్దు అనేది వారి వ్యక్తిగతమన్నారు. నటీనటులు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదన్నారు. అలాంటి వారిని గౌరవం లేకుండా నిందించడం సబబు కాదన్నారు. ఎస్సీ,ఎస్టీల నిధులు ఇతర అవసరాలకు వినియోగించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను గ్యారంటీ పథకాలకు మళ్లించిందని ఆరోపించారు. పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి పదవి కోసం గుద్దులాడుకుంటున్నారని హేళన చేశారు.
కారు– బైక్ ఢీ, ఫైనాన్స్ ఉద్యోగి మృతి
మైసూరు: కారు, బైక్ ఢీకొని మైక్రో ఫైనాన్స్ ఉద్యోగి మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన మైసూరు–ఊటీ హైవేలో నంజనగూడు తాలూకా కళలె గేట్ వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేటె నివాసి మహేష్ (27), మంజుబుద్ధి (23), భారత్ ఫైనాన్సియల్‌లో పనిచేస్తున్నారు. అప్పులను వసూలు చేసేందుకు గుండ్లుపేటె తాలూకా చిక్కాటి గ్రామానికి బైక్‌లో వెళుతుండగా, ఎదురుగా వస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. దీంతో బైక్ సవారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మహేష్ మరణించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నవ వివాహిత ఆత్మహత్య
యశవంతపుర: నవ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు జాలహళ్లిలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా కాణియూరు బాకిమారు గ్రామానికీ చెందిన పూజాశ్రీ (23)కి, బెళ్తగండి తాలూకాకు చెందిన ప్రకాశ్‌తో 10 నెలల క్రితం పెళ్లయింది. జీవనోపాధి కోసం రెండు నెలల క్రితం ఇద్దరూ బెంగళూరు జాలహళ్లిలోని బంధువు ఇంటికి వచ్చారు. పూజాశ్రీ అదే ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియంలేదు. బాగలగుంట పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
శ్రీనివాస రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment