● విద్యాశాఖ అధికారుల సస్పెన్షన్
మైసూరు: జిల్లాలోని హెచ్‌డీ కోటె ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక దాడి జరిపిన ప్రధానోపాధ్యాయుడు గిరీష్ పరారీలో ఉన్నాడు. ఏదో ఒక సాకుతో తన గదిలోకి పిలుచుకుని విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇతడు చాలామంది విద్యార్థినులపై అత్యాచారాలకు పాల్పడ్డాడని సమాచారం. పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడంతో హెచ్‌డీ కోటె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కామాంధుడు గిరీష్ పరారయ్యాడు. ఈ ఉదంతంలో విధి నిర్వహణలో లోపానికి పాల్పడినట్లు తేలడంతో బీఈఓ కాంతరాజు, సీఆర్‌పీ దీపా, ఈసీఓ జయరాం అనే ముగ్గురు అధికారులను డీడీపీఐ జవరేగౌడ సస్పెండ్ చేశారు. హెచ్‌డీకోటె పోలీసులు బీఈఓ కాంతరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆ గ్రామానికి జిల్లాధికారి లక్ష్మీకాంతరెడ్డి, ఎస్పీ విష్ణువర్ధన్ వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. కీచక హెచ్‌ఎంని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
మాదప్పకు శివరాత్రి
కాసుల వర్షం
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ మలెమహదేశ్వర బెట్టలో గత నెల 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని కానుకలు అందజేశారు. ఈ ఐదురోజుల్లో మలెమహదేశ్వరునికి రూ.3.37 కోట్ల ఆదాయం లభించింది. రుసుములు కట్టి 1298 మంది భక్తులు బంగారు రథోత్సవ సేవలు, 122 మంది వెండి రథోత్సవ సేవలు, ఇంకా వేలాది మంది ఇతరత్రా సేవలు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment