యశవంతపుర: దావణగెరె జిల్లా న్యామతి ఎస్‌బీఐ బ్యాంక్‌లో దోపిడీకేసులో ఆరుమంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 కోట్ల విలువగల 17 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఐజీ రవికాంతేగౌడ వివరాలను వెల్లడించారు.
సినిమా లెవెల్లో లూటీ
తమిళనాడులో మదురై ప్రాంతానికి చెందిన విజయకుమార్ (30), అజయకుమార్ (28), పరమానంద (30), అభిషేక్ (23), చంద్రు (23), మంజునాథ్ (32)లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2024 అక్టోబర్ 28న దావణగెరె న్యామతి ఎస్‌బీఐ బ్యాంక్‌లో గ్రిల్స్‌ను తొలగించి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాల తీగలు, అలారం తీగలను కత్తిరించారు. ఆపై లాకర్లను పగలగొట్టి బంగారు నగలను దోచుకెళ్లారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన 17 కేజీల బంగారు ఆభరణాలు దొంగల పాలయ్యాయి. ఇది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సంచలనం కలిగించింది. మొబైల్ టవర్లలో దొరికిపోతామనే భయంతో దొంగలు మొబైల్ ఫోన్లను వాడలేదు. పోలీసులకు ఎలాంటి ఆధారం లభించకుండా ప్లాన్ చేశారు.
లోతైన గుంతలో నగల పెట్టెలు
జిల్లా పోలీసులు అప్పటినుంచి కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ముమ్మరంగా గాలించి దొంగలను పట్టుకున్నారు. దొంగలు తమిళనాడులోని మదురై వద్ద ఉసిలంపట్టి అనే ఊరిలో ఊరిబయట గుంత తవ్వి అందులో నగల పెట్టెలను దాచిఉంచారు. విజయకుమార్ ఈ కేసులో సూత్రధారిగా గుర్తించారు. అతడు బేకరీ నడుపుతూనే దొంగతనాలకు పాల్పడేవాడని గుర్తించారు. ఆభరణాలతో పాటు దోపిడీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
వీడిన న్యామతి బ్యాంకు రాబరీ కేసు
గతేడాది అక్టోబరులో దావణగెరె
జిల్లాలో ఘటన
నిందితులు తమిళనాడువాసులు
బ్యాంకు దొంగల అరెస్టు, 17 కేజీల బంగారం సీజ్