
భలే.. సీతాకోకచిలుకలు
బనశంకరి: బెంగళూరు బిన్నిమిల్ మైదానంలో సీతాకోకచిలుకల ఉద్యానవనంలో రోబోటిక్ సీతాకోకచిలుకలు, కీటకాలు ఆకృతులతో జాగృతి ప్రదర్శన ఆకట్టుకుంటోంది. నేటి ఆధునిక యుగంలో సీతాకోకచిలుకలు కనుమరుగు అవుతున్నాయి. అవి లేకపోతే ప్రకృతికి ముప్పు అనే నినాదంతో ప్రజల్లో జాగృతం చేయడానికి రోబోటిక్ సీతాకోకచిలుకల ప్రదర్శన ఏర్పాటైంది. ఇంకా తూనీగలు, మిడతల బొమ్మలు బాలలు ఆకట్టుకుంటున్నాయి. రోజూ సాయంత్రం 4 గంటలనుంచి 9 వరకు జరుగుతుంఇ. జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఊపిరి తీసిన సిగరెట్
మండ్య: ధూమపానం ఏరూపంలో ఉన్నా ప్రాణాలు తీస్తుందని అంటారు. అలాంటిదే ఈ ఉదంతం. సిగరెటు తాగుతూ బాటిల్‌లో తీసుకొని వచ్చిన పెట్రోల్ బైకు ట్యాంకులో పోస్తుండగా మంటలు అంటుకుని మృత్యువాత పడ్డాడో యువకుడు. జిల్లాలో కేఆర్ పేటె తాలూకాలోని కిక్కెరి వద్ద అన్నెజానకనహళ్ళి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ (25), మార్చి 26వ తేదీన సాయంత్రం బంక్ నుంచి పెట్రోల్‌ను ఓ సీసాలో తీసుకువచ్చి తన బైక్‌లో పోస్తున్నాడు. ఆ సమయంలో అతడు సిగరెట్ తాగుతున్నాడు. పెట్రోల్ ఒలికిపోయి కొంత అతని మీద పడింది. వెంటనే సిగరెట్ వేడికి మంటలు అంటుకున్నాయి. కాలిన గాయాలైన రాకేష్‌ని కొందరు కాపాడి ఆస్పత్రికి తరలించారు. కానీ అతని పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆదివారం రాత్రి మరణించాడు. చిన్న అజాగ్రత్త నిండు ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు వాపోయారు.