
నీటిని పొదుపుగా వాడుకోండి
బళ్లారి రూరల్: మండువేసవిలో జీవనాధారమైన నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్ తెలిపారు. సోమవారం తాలూకాలోని కనగొండనహళ్లి గ్రామంలో జెడ్పీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, జల జీవన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో కర్ణాటక సుస్థిర తాగునీటి సరఫరా యోజనలో 24 గంటలు, వారం రోజులు మంచినీటి సరఫరాను ప్రారంభించి మాట్లాడారు. నిరంతర మంచినీటి సరఫరా వల్ల మహిళలకు అనుకూలమని తెలిపారు. శుద్ధి చేసిన నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులను అరికట్టవచ్చన్నారు. గ్రామంలో రోజంతా మంచినీటి సరఫరా ఉన్నందున గ్రామస్తులు నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. మంచినీటిని ఇంట్లో ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల ఆ నీటి నుంచి దోమలు ఉత్పత్తి అయి డెంగీ వ్యాధి ప్రబలే అవకాశం ఉందన్నారు. జిల్లాలో నిత్యం మంచినీటి సరఫరా అయ్యే గ్రామాల్లో కనగొండనహళ్లి రెండోదన్నారు. జిల్లాలో 100 గ్రామాలకు నిత్యం మంచినీటి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. ఆగస్టు నెలాఖరుకు అన్ని గ్రామాలకు మంచినీరు సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. జిల్లాధికారి గంగాధరస్వామి, జెడ్పీ సీఈఓ సురేశ్ బి.హిట్నాళ్, కుప్పళ విశ్వ బ్యాంకు టాస్క్‌ఫోర్స్ మరియప్ప, ఫీడ్ బ్యాక్ సంస్థ సీఈఓ అజయ్‌సింహ, జీపీ అధ్యక్షురాలు జలజాక్షి తదితర అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.
కలుషిత నీటితో వ్యాధుల బారిన పడొద్దు
అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవద్దు
దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్