
త్వరలో చెన్నమ్మ సర్కిల్‌లో సంచారం బంద్
హుబ్లీ: నగర నడిబొడ్డున జరుగుతున్న పైవంతెన నిర్మాణ పనులతో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్థం అయింది. ఈ క్రమంలో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నాలుగు నెలల పాటు చెన్నమ్మ సర్కిల్‌కు ట్రాఫిక్ బంద్ చేయాలని జిల్లా యంత్రాంగం తీర్మానించింది. దీంతో ట్రాఫిక్ సంచారానికి తీవ్రమైన ఇబ్బందులతో పాటు వాణిజ్య వ్యాపారాలకు భారీగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇటీవల కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 19 నుంచి ఆగస్ట్ 20 వరకు చెన్నమ్మ సర్కిల్ నుంచి పాత కోర్టు సర్కిల్, బసవన సర్కిల్, హొసూరు గాళి దుర్గమ్మ దేవస్థానం వరకు రోడ్డును చాలా వరకు బంద్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చెన్నమ్మ సర్కిల్‌లోని ఓ భాగాన్ని పూర్తిగా బంద్ చేసి సర్కిల్ వద్ద రూటర్ నిర్మాణం, పిల్లర్ల జోడింపు పనులు జరుగుతున్నాయి. ముందుస్తు జాగ్రత్తగా అయోధ్య హోటల్ నుంచి చెన్నమ్మ సర్కిల్ ద్వారా వాహనాల సంచారం స్తంభించనుంది. ఈ మార్గంలో సంచరించే వాహనాలు ప్రస్తుతం నిలిజన్ రోడ్డు గుండా వెళుతున్నాయి.
ప్రత్యామ్నాయ మార్గ అన్వేషణకు సూచన
ఈ విషయంలో జిల్లా యంత్రాంగం చెన్నమ్మ సర్కిల్ నుంచి పాత బస్టాండ్‌కు రాకపోకలు నిలిపి వేయాలని తీర్మానం చేసింది. అంతేగాక ప్రత్యామ్నాయ మార్గం గుర్తించి ఆర్‌టీసీ బస్సులు ఇతర వాహనాల కార్యాచరణకు తగిన వ్యవస్థ రూపొందించాలని పోలీస్ శాఖకు సమావేశంలో సూచించారు. ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి మాట్లాడుతూ నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సదరు కంపెనీకి సూచించారు. ఈ పనులు పూర్తి అయ్యాక ల్యామింగ్‌టన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ దిశలో అవసరమైన భూస్వాధీన ప్రక్రియకు శ్రీకారం చుడుతామన్నారు. జిల్లాధికారిణి దివ్యప్రభు మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం, త్వరగతిన పూర్తి చేయడానికి సమావేశంలో విస్తృతంగా చర్చించామన్నారు. 15 రోజుల్లోగా చెన్నమ్మ సర్కిల్ నుంచి విజయపుర రోడ్డు వరకు ఫ్‌లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కంపెనీకి సూచించారు. సజావుగా ట్రాఫిక్ నిర్వహణకు రూపు లేఖలు రూపొందించాలని పోలీస్ శాఖకు సూచించామన్నారు.
ఈనెల 19 నుంచి ఆగస్టు 20 వరకు ట్రాఫిక్ నిలిపివేతకు తీర్మానం