
నకిలీ బంగారంతో లోన్లు.. ఈడీ దాడులు
శివమొగ్గ: శివమొగ్గ డీసీసీ బ్యాంకు నగర శాఖలో జరిగిన నకిలీ బంగారం కుంభకోణం కేసులో మంగళవారం శివమొగ్గ, బెంగళూరులో పలు చోట్ల ఈడీ అధికారులు దాడులు జరిపారు. వివరాలు.. శివమొగ్గ నగరంలోని గోపాలగౌడ బడావణెలో డీసీసీ బ్యాంకు శాఖ మాజీ మేనేజర్, కామాక్షి వీధిలోని బ్యాంకు వాహన డ్రైవరు, భద్రావతిలోని సిబ్బంది నివాసం, బీహెచ్ రోడ్డులోని డీసీసీ బ్యాంకులో సోదాలు జరిపారు. మరో వైపు బెంగళూరులోని అపెక్స్ బ్యాంకు కార్యాలయం, శివమొగ్గ డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు ఆర్‌ఎం మంజునాథగౌడల నివాసాలలో గాలింపు జరిపారు. మంజునాథగౌడను విచారణ చేపట్టారు. 2023లో కూడా ఈడీ అధికారుల బృందం ఆర్‌ఎం మంజునాథగౌడకు చెందిన తీర్థహళ్లిలోని నివాసంతో పాటు పలు చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించింది.
కేసు ఏమిటంటే...
2014లో డీసీసీ బ్యాంకు శివమొగ్గ నగర శాఖలో నకిలీ బంగారు రుణాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు పెద్దలు నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి కోట్లాది రూపాయలను రుణంగా తీసుకుని స్వాహా చేసినట్లు తెలిసి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్పట్లో డీసీసీ బ్యాంకు అధ్యక్షునిగా ఉన్న ఆర్‌ఎం మంజునాథగౌడతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు అప్పగించింది. ఆ తర్వాత మంజునాథగౌడను నిర్దోషిగా ప్రకటించారు. ఆ తరువాత ఈడీ రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేసింది. ఈడీ దర్యాప్తుపై మంజునాథగౌడ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. తరువాత స్టేను ఎత్తివేయడంతో ఈడీ దాడులు మొదలయ్యాయి.
శివమొగ్గ, బెంగళూరులో సోదాలు

నకిలీ బంగారంతో లోన్లు.. ఈడీ దాడులు