
రైతు కష్టాలను చూడలేక కొడుకు ఆత్మహత్య
గౌరిబిదనూరు: అన్నదాతల ఇంట ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం కనిపించక, బతికే దారి కానరాక అవస్థలు పడుతున్నారు. వివరాలు... తాలూకాలోని తొండేబావి గ్రామంలో యువ రైతు పవన్ (22) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రామ్‌కుమార్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడైన పవన్ వ్యవసాయంలో తండ్రికి చేదోడుగా ఉండేవాడు. గత మూడేళ్లుగా పంట సరిగా చేతికందక, వచ్చినా ధరలేక నష్టపోతున్నారు. సహకార బ్యాంకులో రూ.రెండు లక్షల వరకు రుణాలున్నాయి. సేద్యానికి, కుటుంబ పోషణకు తండ్రి పడుతున్న బాధలను చూడలేక విరక్తి చెందిన పవన్ కఠోర నిర్ణయం తీసుకున్నాడు. గురువారం ఉదయం ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బాధిత కుటుంబాన్ని తహసీల్దారు మహేశ్ పత్రి, కొచిముల్ డైరెక్టర్ కాంతరాజు కుటుంబ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
పవన్ (ఫైల్)