
హుబ్లీ– ధారవాడకు కొత్త పథకం!
బనశంకరి: జంట నగరాలైన హుబ్లీ– ధారవాడ మధ్య ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్ రాపిడ్ ట్రాన్సిట్ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. శనివారం బెంగళూరులో నివాసంలో సీఎం సిద్దరామయ్య, ఉన్నతాధికారులు, కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. హుబ్లీ– ధారవాడ మధ్య ఎలక్ట్రిక్ రాపిడ్ ట్రాన్సిట్ పథకం అమలు చేయడం గురించి మూడు నెలల్లోగా పూర్తి నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. హుబ్లీ, ధారవాడలో ఈ పథకం విజయవంతమైతే ఇతర నగరాల్లోనూ కల్పిస్తామని తెలిపారు. మెట్రో తరహాలోని ఈ సంచార వ్యవస్థ యూరప్‌లోని అనేక దేశాల్లో నడుస్తోందని నిపుణులు తెలిపారు. మంత్రులు రామలింగారెడ్డి, సంతోష్‌లాడ్ తదితరులు పాల్గొన్నారు. ట్రామ్‌ల మాదిరిగా బ్యాటరీ బస్సులను నిర్ణీత మార్గంలో నడిపించడమే ఈ ట్రాన్సిట్ పథకం లక్ష్యం. కొన్ని దేశాల్లో ట్రాక్‌ల మీద నడుస్తాయి, కొన్ని దేశాల్లో ట్రాక్‌లు లేవు.