
ఎయిర్‌పోర్టులో హిందీ మాయం?
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయం డిస్‌ప్లే బోర్డులో ఇంగ్లీష్, హిందీలో మాత్రమే సమాచారం ఇచ్చేవారు. ఆకస్మాత్తుగా హిందీ భాషను తీసివేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కన్నడలో సమాచారం వస్తోంది. ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారికంగా ఏమీ ప్రకటన చేయకపోయినా దక్షిణాదిలో బలవంతంగా హిందీ అని విమర్శలు వస్తుండడంతో ఆ భాషను తీసివేసినట్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు హిందీ తీసివేయడాన్ని సమర్థించారు. కన్నడలో మాత్రమే కనిపిస్తున్న డిస్‌ప్లే బోర్డు వీడియోను ఎక్స్‌లో 20 లక్షల మంది వీక్షించారు.
మలప్రభ నదిలో బాలుడు, జవాన్ జలసమాధి
దొడ్డబళ్లాపురం: నదిలో స్నానానికి దిగిన బాలుడు నీటమునగగా రక్షించబోయి ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటన బాగలకోట జిల్లా బాదామిలో చోటుచేసుకుంది. శేఖప్ప (15), మహంతేశ్ హొసమని (25) మృతులు. శనివారం సాయంత్రం బాలుడు శేఖప్ప స్నానం చేయడానికి మలప్రభ నదిలో కి దిగాడు. అయితే జారి నీటమునిగాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఆర్మీ జవాన్ మహంతేశ్ బాలున్ని రక్షించాలని నదిలోకి దిగాడు, కానీ ఇద్దరూ నీటమునిగి మరణించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు గాలింపు జరిపి మృతదేహాలను వెలికి తీశారు. జవాన్ మహంతేశ్ మూడేళ్ల కిందట సైన్యంలో ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. సెలవు మీద ఊరికి వచ్చి ప్రాణాలు పొగొట్టుకున్నాడని కుటుంబీకులు విలపించారు.
పసిగుడ్డును వదిలేసిన తల్లి
దొడ్డబళ్లాపురం: కాన్పు జరిగి ఆడపిల్ల పుట్టినా, మగ పిల్లాడే అయినా తల్లి ప్రేమగా ఒడిలోకి తీసుకుని లాలిస్తుంది. కానీ ఈ రాక్షసి తల్లి మాత్రం పాప పుట్టిందని ఆగ్రహించి పురిటి బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిపోయిన అమానుష సంఘటన బాగలకోటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కాన్పు అయిన తరువాత ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి బాలింత ఒక్కటే పరారైంది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కూతురు జన్మించడం వల్లే ఇలా చేసిందని ఆస్పత్రి సిబ్బంది అనుమానిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులు, మహిళా– శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు పాపను ఆశ్రయ కేంద్రానికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
నేత్రపర్వంగా ఎల్లమ్మ కరగ
విజయపుర: ఇక్కడి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయంలో 86వ పూల కరగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. ప్రత్యేకంగా పలువురు భక్తులు పూల, ముత్యాల పల్లకీలను ఏర్పాటు చేశారు. మల్లెలు, కనకాంబరాలతో తీర్చిదిద్దిన కరగను పూజారి ఎత్తుకుని మేళతాళాలకు అనుగుణంగా నాట్యమాడుతూ పురవీధుల్లో ముందుకు సాగారు.
గోపురం నుంచి
దూకాలని యత్నం
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలేమహదేశ్వర బెట్టలో ఉన్న ప్రసిద్ధ మలెమహదేశ్వర దేవస్థానం గోపురం ఎక్కి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఆ వ్యక్తిని ఆలయ సిబ్బంది రక్షించారు. మైసూరు జిల్లా హెచ్‌డీ కోటెకు చెందిన మృత్యుంజయ అనే వ్యక్తి గోపురం నుంచి ఎక్కి దూకాలని యత్నించాడు. ఇతడు గోపురం ఎక్కుతున్నట్టు గుర్తించిన సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని బుజ్జగించి కిందకి దిగేలా చేశారు. ఇతడు కుటుంబ సమస్యలతో మానసికంగా కుంగిపోయి ఉన్నట్లు తెలిసింది. శరీరంపై ఎలాంటి దుస్తులు లేకపోవడంతో పోలీసులే కొత్త దుస్తులు తెప్పించి ఇచ్చారు. బస్సు చార్జీలు కూడా ఇచ్చి ఇంటికి పంపించారు.

ఎయిర్‌పోర్టులో హిందీ మాయం?

ఎయిర్‌పోర్టులో హిందీ మాయం?