
షరా మామూలేనా?
సైబర్ చీటింగ్
రూ.40 లక్షలు స్వాహా
బనశంకరి: సిలికాన్ సిటీపై సైబర్ మోసగాళ్లు పంజా విసురుతున్నారు. తేలికగా డబ్బులు పడిపోతాయని మాటలతో మభ్యపెట్టి ప్రజలను లూటీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమదైన పంథాలో పెట్రేగిపోతుంటే బాధితులు బిక్కమొగం వేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడకండి... అని కాలర్ ట్యూన్స్, మీడియాలో ప్రకటనలు, హోర్డింగుల ద్వారా ప్రభుత్వాలు ప్రజలను ఎంత జాగృతం చేసినప్పటికీ షరా మామూలే అన్నట్లు అయిపోయింది.
ఒకరికే రూ.2.68 కోట్ల శఠగోపం
యూట్యూబ్ వీక్షించే సమయంలో ప్రకటన గమనించి మోసపూరిత ట్రేడింగ్ యాప్‌లో రూ.2.68 కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యక్తి నిండా మునిగిపోయాడు. బెంగళూరు సుబ్రమణ్యపుర గుబ్బిలాళ అపార్టుమెంట్ నివాసి బేలూరు నరసింహమూర్తి రవీంద్ర అనే వ్యక్తి ఈ మేరకు దక్షిణ విభాగ సీఈఎన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
జనవరి 3వ తేదీన ఇంట్లో నరసింహమూర్తి యూట్యూట్ చానల్ చూస్తుండగా అబాన్స్ స్మార్ట్స్ ట్రేడర్స్ అనే ప్రకటన వచ్చింది. దీనిపై క్లిక్‌చేయగానే శార్దూల్ జానీ అనే వ్యక్తి మొబైల్ నంబరు ఉంది. కాల్ చేసి మాట్లాడగా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ చేసుకున్నారు. తమ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకుని నగదు పెట్టుబడి పెట్టాలని సలహా ఇచ్చారు. బాధితుడు కొంత మొత్తం పెట్టుబడి పెట్టగా 5 శాతం లాభం వచ్చింది. దీంతో మరింత ఆశ పెరిగి దశలవారీగా రూ.2.68 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఓసారి రూ.50 వేల కమీషన్ ఇచ్చారు. మిగిలిన నగదు వాపస్ ఇవ్వలేదు. తన డబ్బును విత్‌డ్రా చేయబోగా మరింత పెట్టుబడి పెడితే విత్‌డ్రా చేయవచ్చునని షరతు విధించారు. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పైగా మోసగాళ్లు యాప్‌ను బ్లాక్ చేసి అడ్రస్ లేకుండా పోయారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
బాధితుల కష్టార్జితం మోసగాళ్లపరం
సిలికాన్ నగరంలో
కేటుగాళ్ల పంజా
ముగ్గురికి రూ. 3.74 కోట్ల టోకరా
షేర్ల పేరుతో చీటింగ్ యాప్‌లలో పెట్టుబడులు
ఫలితమివ్వని జాగృతి చర్యలు
రూ.66 లక్షలు అంతే
బనశంకరి మూడో స్టేజ్‌వాసి శ్రీనివాసపుర మంజునాథ్ అనే వ్యక్తి వాట్సాప్‌కు ఓ మెసేజ్ వచ్చింది. తమ యాప్ ద్వారా పెట్టుబడి పెట్టాలని సూచించారు. నమ్మిన అతడు రూ.66.51 లక్షలు ధారపోసి లబోదిబోమన్నాడు. ఫిబ్రవరి 17 తేదీన మంజునాథ్ వాట్సాప్‌కు మిరే అసెట్ షేర్‌ఖాన్ సెక్యురిటీస్‌లో పెట్టుబడి పెడితే చాలా లాభం లభిస్తుందని ఆశపెట్టారు. దీనిని నమ్మిన మంజునాథ్ లింక్‌పై క్లిక్‌చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దశలవారీగా షేర్లు కొనుగోలు, విక్రయాలు నిర్వహించాడు. అలాగే రూ.66.51 లక్షలు విలువచేసే షేర్లు కొనుగోలు చేశారు. యాప్‌లో రూ.1.08 కోట్ల లాభం గడించినట్లు చూపించారు. ఇటీవల కొంతసొమ్ము డ్రా చేయడానికి ప్రయత్నించగా కుదరలేదు. వారికి కాల్ చేయగా అందుబాటులోకి రాకుండా పోవడంతో వంచించారని గ్రహించిన మంజునాథ్ దక్షిణ విభాగం సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
బనశంకరి మూడోస్టేజ్ ఐటీఐ లేఔట్ నివాసి వాదిరాజ్‌రావ్ అనే వ్యక్తి యాప్‌లో రూ.5.19 కోట్లు లాభం గడించినట్లు ఆశచూపించి రూ.40 లక్షల వంచనకు పాల్పడ్డారు. ప్రైవేటు కంపెనీ జనరల్ మేనేజర్ అయిన వాదిరాజ్‌రావ్ వాట్సాప్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్‌చేసి ఓ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. షేర్లను కొనుగోలు, విక్రయాలు చేయడం కోసం నగదు బదిలీ చేశాడు. ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 02 తేదీ వరకు దశలవారీగా సుమారు రూ. 40 లక్షలు పెట్టుబడి పెట్టారు. అప్లికేషన్‌లో రూ.5.19 కోట్లు లాభం వచ్చిందని చూపించారు. కానీ విత్‌డ్రా చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీనిపై ప్రశ్నించగా వంచకులు ఆయనను బ్లాక్ చేశారు. బాధితుడు దక్షిణ విభాగ సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

షరా మామూలేనా?

షరా మామూలేనా?