
లక్ష్యంతో ఉత్తమ భవిత సాధ్యం
బళ్లారి రూరల్ : లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉత్తమ భవిత కోసం శ్రమించాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ సంచాలకుడు ఐఏఎస్ డాక్టర్ కే.రాజేంద్ర తెలిపారు. శనివారం రాత్రి దావణగెరె జేజేఎంఎంసీ(జైజగద్గురు మురుఘ రాజేంద్ర మెడికల్ కాలేజ్) గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంబీబీఎస్ ముగించుకొని వైద్యులుగా సమాజంలో అడుగు పెడుతున్న యువవైద్యులు ముందు లక్ష్యాన్ని నిర్థేశించుకొని ఆ దిశగా శ్రమించాలన్నారు. నేటి యువత మాదకద్రవ్యాలు, మత్తుకు లోనై భవితను చిత్తు చేసుకొంటున్నారన్నారు. డ్రగ్స్ వ్యవసం కంటే ఇప్పుడు సోషల్ మీడియా వ్యసనం ప్రమాదకరంగా మారింది. దీంతో రియల్ హీరోల్లా ఉండాల్సిన వారు రీల్స్ చేసుకొంటున్నారన్నారు. తాను 2008లో ఇదే కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు తెలిపారు. 2013లో సివిల్స్ రాసి బళ్లారి, మైసూరు తదితర జిల్లాల్లో పని చేసినట్లు తెలిపారు. గౌరవ అతిథి, దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్ మాట్లాడుతూ తాను ఇక్కడే దంత వైద్యురాలిగా చదివినట్లు తెలిపారు. సమాజంలో వైద్య వృత్తి అత్యంత గౌరవ ప్రదం అని తెలిపారు. తల్లిదండ్రులను, గురువులను ఎప్పటికీ గౌరవించాలన్నారు. డాక్టర్ రాజేంద్ర, డాక్టర్ ప్రభా మల్లికార్జున్‌లను సన్మానించారు. జూనియర్ వైద్యులకు డాక్టర్ పట్టాలను ప్రదానం చేశారు. వైద్యకళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ శుక్లా ఎస్.శెట్టి, మాజీ ప్రిన్స్‌పాల్ డాక్టర్ మంజునాథ ఆలూరు, ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎల్.డి, వైద్యులు, జూనియర్ వైద్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రోగులతో ఆత్మీయులుగా
ఉత్తమ వైద్యులుగా ఎదగాలి
పర్యాటక అభివృద్ధి శాఖ సంచాలకుడు డాక్టర్ రాజేంద్ర

లక్ష్యంతో ఉత్తమ భవిత సాధ్యం