
కులగణన నివేదికకు బ్రేక్
సాక్షి, బెంగళూరు: అంతా అనుకున్నట్లుగానే జరిగింది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం సిద్ధరామయ్య తీసుకొచ్చిన కులగణన నివేదికకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో బలమైన కుల సంఘాల హెచ్చరికలు, మంత్రుల వ్యతిరేకతే దీనికి కారణమని చెప్పుకోవచ్చు. గురువారం సాయంత్రం విధానసౌధలో కులగణన నివేదిక గురించి రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. పలువురు మంత్రులు కులగణన నివేదికను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కావాల్సిన కేబినెట్ భేటీ గంట ఆలస్యంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం అయింది.
తీవ్ర భిన్నాభిప్రాయాలు
సుమారు 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. మంత్రుల అభిప్రాయాలను, అభ్యంతరాలను లిఖిత రూపంలో ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. పలువురు మంత్రులు బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ప్రజల్లో తీవ్ర ఇబ్బందులు పడతామని హెచ్చరించారు. మరికొందరు మంత్రులు కాగితం మీద అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రులు నివేదికకు అనుకూలంగా మాట్లాడారు. సిద్ధరామయ్య ఎంత ప్రయత్నించినా ఏకాభిప్రాయం వీలుపడలేదు. మొత్తం 31 మంంది మంత్రులు పాల్గొన్నారు. మంత్రి దినేశ్ గుండూరావు, మంత్రి కె.వెంకటేశ్‌లు ముందే చెప్పి గైర్హాజరయ్యారు. ఎలాంటి తీర్మానం చేయకుండానే ముగిసింది. కేబినెట్ భేటీకి ముందు సీఎం కార్యాలయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రత్యేకంగా మంతనాలు జరిపారు.
రాష్ట్రంలో సెగలు పుట్టించిన కుల గణన నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తుందా, లేక తిరస్కరిస్తుందా? అనే ఉత్కంఠ మధ్య జరిగిన కేబినెట్ భటీ ఏమీ తేల్చకుండానే ముగిసింది. నివేదికలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని ప్రముఖ కులసంఘాలు కన్నెర్ర జేయడం తెలిసిందే. ఆమోదిస్తే తమ సత్తా చూపుతామనని కూడా స్పష్టం చేశాయి.
దీంతో సర్కారు వెనక్కి తగ్గింది.
మంత్రిమండలి సమావేశంలో తలోమాట
కొందరు మంత్రుల వ్యతిరేకత
ఎలాంటి నిర్ణయం లేకుండానే
ముగిసిన భేటీ
మే 2న మళ్లీ భేటీ: మంత్రి
సమావేశం తరువాత మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ కులగణన నివేదిక లీక్ కాలేదని, నివేదికలోని గణాంకాలు మాత్రమే మీడియాలో ప్రసారం అయ్యాయని చెప్పారు. మే 2న మరోసారి ప్రత్యేక కేబినెట్ భేటీ జరగనుందని, ఆ సమావేశంలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కులగణన నివేదికకు బ్రేక్

కులగణన నివేదికకు బ్రేక్