
కలబుర్గిలో ఐదుగురు పాకిస్తానీలు
యశవంతపుర: కలబుర్గి లో ఐదుమంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నగరంలోని అశోక్‌నగర ఠాణా పరిధిలో వీరు నివాసం ఉన్నట్లు తెలిసి పోలీసులు విచారణ చేపట్టారు. కలబుర్గిలోనే 9 మంది నివాసం ఉన్నట్లు తేలిందని పోలీసు కమిషనర్ శరణప్ప విలేకర్లకు తెలిపారు. వీరిలో ఇద్దరు దీర్ఘకాల వీసాపై ఉండగా, మిగిలినవారు విజిటర్ వీసాపై వచ్చి మకాం వేసినవారని చెప్పారు. భారత్‌కు వచ్చిన మరో ఇద్దరు అమెరికాకు వెళ్లిపోయారన్నారు. ఉగ్రవాద దాడులు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీలను గుర్తించి వారి దేశానికి పంపించవలసి ఉంది.
రిక్కీ గన్‌మ్యాన్ అరెస్టు
దొడ్డబళ్లాపురం: రిక్కీ రై పై కాల్పుల ఘటనలో పోలీసులు గన్‌మెన్ మోనప్ప విఠల్ ను అరెస్టు చేసారు. విఠల్‌ను అరెస్టు చేసిన పోలీసులు రామనగర జేఎంఎఫ్‌సీ కోర్టులో హాజరుపరచగా విచారణ కోసం 10 రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించింది. ఏప్రిల్ 22న విఠల్‌ను స్టేషన్ తీసుకువచ్చి విచారించగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పాటు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విఠల్ కోలుకున్నాక అరెస్టు చేయడం జరిగింది. అతని వద్ద ఉన్న గన్ స్వాధీనం చేసుకుని పరీక్షించగా బుల్లెట్ల లెక్కలో తేడా కనిపించింది. రిక్కీ రై వద్ద ఉన్న గన్‌మెన్‌ల నుంచి మొత్తం 7 గన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎవరి గన్ నుండి ఫైరింగ్ జరిగింది అని కనుక్కునేందుకు ల్యాబ్‌కు తరలించారు.