
శిథిలావస్థలో చారిత్రక కోట
రాయచూరు రూరల్: నగరంలోని పురాతన కాలం నాటి చారిత్రక కోట ఆనవాళ్లు వినాశపుటంచునకు చేరాయి. కేంద్ర బస్టాండ్ సమీపంలోని మక్కా దర్వాజ కోట పైభాగంలో పిచ్చి మొక్కలు మొలిచాయి. మరి కొన్ని చోట్ల కోట గోడలు బీటలు వారాయి. ఇంకో వైపు కొన్ని చోట్ల కోట గోడలు కూలిపోతున్నాయి. నిర్వహణ లోపం కారణంగా కోట గోడలు పతనావస్థలో ఉన్నాయి. కొండపై ఉన్న ఇనుప ఫిరంగుల(తోపులు) సంరక్షణపై అధికారులు నిర్లక్ష్యం వహించారు. సోలార్ విద్యుత్ ప్రసారం ఉన్నా చాలా ఏళ్లుగా దీపాలు వెలగడం లేదు. కొండపై బీరు, మద్యం సీసాలు, ప్లాస్టిక్ కవర్లు పడ్డాయి. కొండపై ఉన్న కోటను ఎక్కడానికి తగిన మెట్లు లేకపోవడంతో కొంత మంది ఆకతాయిలు కోట గోడలను, స్మారకాలను ధ్వంసం చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు రాయచూరులోని కోటవ స్మారకాల సంరక్షణ వైపు కన్నెత్తి చూడక పోవడంతో కోట ఆనవాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. శిథిలావస్థకు చేరుకోక మునుపే అభివృద్ధి పరచడానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించినా ఇంతవరకు ఉలుకు పలుకు లేదు. ఇకనైనా పురాతత్వ, పర్యాటక శాఖ అధికారులు సత్వరం మేల్కొని కొండపై భాగంలో ఉన్న కోట పైకి రోప్‌వే నిర్మించి పర్యాటక స్థలంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంరక్షణపై అధికారుల దివ్య నిర్లక్ష్యం
నిర్వహణ లోపం స్మారకాలకు శాపం

శిథిలావస్థలో చారిత్రక కోట

శిథిలావస్థలో చారిత్రక కోట