
తానొకటి తలిస్తే... మరొకటి జరిగింది. నిద్రలేవగానే నక్క ముఖం చూడటం లక్ అని అతను భావిస్తే... పోలీసులు అతనికి జలక్ ఇచ్చారు. నక్కను బంధించాడని అతడ్ని పోలీసులు జైలుకు పంపించారు. ఈ సంఘటన కర్ణాటకలోని తుమకూరు రూరల్ పరిధిలోని నాగవల్లి గ్రామంలో జరిగింది. నాగవల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ మూఢనమ్మకాలు అనుసరిస్తాడు. ఎవరికైనా డబ్బులు వస్తే నక్క తోక తొక్కాడు... నక్క ముఖం చూశాడు... అనే సామెతలను బాగా నమ్మేవాడు.
ఈ క్రమంలో అతను తన ఇంట్లో రెండు నక్క ఫొటోలను పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా అడవిలో ఉన్న ఒక నక్కను పట్టుకొచ్చి తన కోళ్లఫారం వద్ద బోనులో పెట్టాడు. ప్రతి రోజు ఉదయం దాని ముఖం చూసేవాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి నక్కను స్వాధీనం చేసుకున్నారు. అడవిలో ఉండాల్సిన నక్కను బోనులో పెట్టడం నేరమని లక్ష్మీకాంత్‌ను అరెస్ట్ చేశారు. నక్కను అటవీ సిబ్బందికి అప్పగించారు.
– తుమకూరు
Comments
Please login to add a commentAdd a comment