ఖమ్మంమామిళ్లగూడెం: పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలుకాకుండా ఇక్కడి ప్రభుత్వం అడ్డుకుంటోందని జమ్మూ కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్ విమర్శించారు. ఖమ్మంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం యువత బలిదానాలు చేసి తెలంగాణ కోసం పోరాడగా రాష్ట్ర ఏర్పాటుకు నాడు బీజేపీ పార్లమెంట్‌లో కృషి చేసిందని గుర్తుచేశారు. అయితే, రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆరోపించారు. దళితబంధు అంటున్న సీఎం కేసీఆర్ ప్రజలకు అన్ని బంద్ పెట్టారని పేర్కొన్నారు.
ఖమ్మంలో జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.1,200 కోట్ల నిధులు ఇచ్చిందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేస్తుండగా, ఖమ్మం మార్కెట్‌లో మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ కూడా అందుబాటులో లేదని చెప్పారు. అలాగే, ఖమ్మంలో బీజేపీ కార్పొరేటర్ ఉన్న డివిజన్‌కు నిధులు కేటాయించడంలో వివక్ష చూపిస్తున్నారని తెలిపారు. కాగా, గురువారం ఖమ్మంలో జరగాల్సిన సభకు కేంద్ర హోమంత్రి అమిత్‌షా హాజరు కావాల్సి ఉన్నా, వివిధ రాష్ట్రాల్లో తుపాన్ కారణంగా వాయిదా పడిందని నిర్మల్‌సింగ్ చెప్పారు.
త్వరలోనే ఖమ్మంలో అమిత్‌షా సభ ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన ఖమ్మం సారథినగర్‌లోని రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించగా, రోడ్డుకు లింక్ చేయకపోవడంతో నిరుపయోగంగా మారిందని బీజేపీ నాయకులు తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్ దొంగరి సత్యనారాయణ, నాయకులు నున్నా రవికుమార్, దేవకి వాసుదేవరావు, నకిరికంటి వీరభద్రం, చావా కిరణ్, గంటెల విద్యాసాగర్, శ్యాంరాథోడ్, రుద్ర ప్రదీప్, వీరెల్లి లక్ష్మయ్య, అల్లిక అంజయ్య, దొడ్డ అరుణ తదితరులు పాల్గొన్నారు.
పత్తిపై జీఎస్టీ సమస్య పరిష్కరించాలి
ఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లపై వస్తు సేవా పన్ను (జీఎస్టీ) సమస్యను పరిష్కరించాలని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ నిర్మల్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల మార్కెట్‌లో పత్తి కాలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన చాంబర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా చాంబర్ బాధ్యులు మాట్లాడుతూ తొలుత పత్తి కొనుగోళ్లపై జీఎస్టీ వసూలు చేయగా, ఆ తర్వాత అమ్మకంపై కూడా జీఎస్టీని విధించడంతో భారం పడిందని తెలిపారు. బీజేపీ నాయకులతో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, బాధ్యులు సోమా నర్సింహారావు, మన్నెం కృష్ణ, తల్లాడ రమేశ్, నల్లమ ల ఆనంద్, చెరుకూరి సంతోష్‌కుమార్, పాండురంగారావు, సత్యంబాబు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment