ఖమ్మం: క్రికెట్ ప్రపంచకప్ మొదలైంది. దీంతోపాటు బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. వరుసగా భారత్ మ్యాచ్‌లు ఉండటంతో బెట్టింగ్ రాయుళ్లు ఈసారైనా గతంలో పోగొట్టుకున్నది వస్తుందేమోననే ఆశతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లు వరుసగా జరగడంతో స్వల్ప సమయంలో ఎక్కువ ధనార్జన కోసం ఈ పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచకప్ సుమారు నెలన్నరపాటు జరగనుండటంతో బెట్టింగ్ జోరుగా సాగే అవకాశాలున్నాయి.
ఒకప్పుడు కేవలం మెట్రో ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగ్ ప్రస్తుతం పల్లెలకు సైతం విస్తరించింది. జిల్లాలోని ఖమ్మంలో బార్లు, హోటళ్లు మ్యాచ్‌లు ఉన్న సమయంలో నిండిపోతున్నాయి. బెట్టింగ్‌లు ఉండటంతోనే ఇవి కళకళలాడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బెట్టింగ్‌ను నియంత్రించే వాళ్లు లేకపోవడంతో పందెం కాసేవాళ్లకు హద్దు లేకుండా పోయింది. అయితే, బెట్టింగ్‌లో పాల్గొని అప్పులపాలై కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా జిల్లాలో ఉన్నాయి.
ప్రతీ సిక్స్, ఫోర్‌పైనా..
ఒకప్పుడు ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్‌లు జరిగేవి. మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా జోరుగా పందేలు సాగుతున్నాయి. భారత్ ఆడే 9 మ్యాచ్‌ల్లో ఎవరు గెలుస్తారనే దానిపైనే పందేలు ఎక్కువగా కాస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు కూడా బెట్టింగ్ నడుస్తూనే ఉంటుందని తెలుస్తోంది. బ్యాట్స్‌మెన్ కొట్టే సిక్స్, ఫోర్లపైనా.. బౌలర్ తీసే వికెట్లపైనా.. వైడ్ బాల్, నోబాళ్లపైనా పందేలు నడుస్తుంటాయి. మ్యాచ్ టై అయ్యే దానిపైన కూడా పందెం వేసుకునే వెసులుబాటు ఉన్నట్లు తెలుస్తోంది.
డబ్బు పోగొట్టుకుంటున్న యువత..
గ్రామీణ ప్రాంతాల్లోని యువత జోరుగా బెట్టింగ్‌కు పాల్పడుతోంది. ఇంట్లో తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి డబ్బు తీసుకోవడం.. స్నేహితుల దగ్గర అప్పుగా తీసుకొని పందెంలో పెట్టి పోగొట్టుకోవడం తరచుగా కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో జరిగే బెట్టింగ్‌లో వంద పెడితే రూ.300 ఇస్తామంటూ ఊరిస్తూ వలలో వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇరుక్కుంటే ఇక అంతే సంగతులు. తొలుత డబ్బులు వచ్చినట్టే వచ్చి ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది.
అప్పుడు పోయిన డబ్బు కోసం మళ్లీ పందెం కాయడం, ఉన్న డబ్బు అంతా పోగొట్టుకోవడం.. దీంతో మనస్తాపానికి గురై యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలువురు చెబుతున్నారు. కాగా, ఖమ్మంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో లింక్‌బార్లే బెట్టింగ్‌కు అడ్డాలుగా మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. లింక్ బార్లో కూర్చోని, మద్యం సేవిస్తూ సెల్‌ఫోన్‌ల ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం, బెట్టింగ్ ఖర్చులను లింక్‌బార్ యాజమాని వద్దే అప్పుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఆఫ్‌లైన్‌లోనూ..
గతంలో క్రికెట్ బెట్టింగ్ కేవలం ఆన్‌లైన్ ద్వారానే కొనసాగేది. ఇందుకోసం ముందస్తుగా రూ.లక్ష డిపాజిట్ చేస్తే ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్ చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పేలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బెట్టింగ్‌కు పాల్పడటం సులభంగా మారింది.
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడితే దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే కారణాలతో ఫోన్ పే, గూగుల్ పేనే ఆశ్రయిస్తున్నారు. అయితే, దాదాపు నెలన్నర రోజుల పాటు బెట్టింగ్ జరిగే అవకాశాలున్నప్పటికీ దీనిని నియంత్రించే వారు కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖ పట్టిష్టమైన గస్తీని ఏర్పాటు చేసి బెట్టింగ్‌కు పాల్పడే ముఠాలను పట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment