దురిశెట్టి భార్గవి (ఫైల్)
సాక్షి, ఖమ్మం: కుమార్తెను ఓ ఇంటి దాన్ని చేసి బాధ్యత తీర్చుకోవాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఈ మేరకు నిశ్చితార్థం కూడా పూర్తిచేశారు. ఇక పెళ్లి పనుల్లో నిమగ్నం కాగా.. యువతి అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువాత పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని జాస్తిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దురిశెట్టి తిరుమల్‌రావు – మాధవి కుమార్తె భార్గవి (20)కి ఖమ్మం రూరల్ మండలం తనకంపాడుకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది.
మూడు నెలల కిందట నిశ్చితార్థం జరిపించి ఈ నెల 26న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఓపక్క పెళ్లి ఏర్పాట్లలో ఉండగానే.. భార్గవి పది రోజుల కిందట జ్వరం బారిన పడింది. స్థానిక గ్రామీణ వైద్యుడి వద్ద చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో ఈనెల 18న ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఓ పక్క పెళ్లి కోసం ఇంటికి రంగులు వేయగా.. కుమార్తె మృతదేహాన్ని తీసుకురావడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు.
చదవండి: ఓ యువకుడు పండుగ సెలవులకి వచ్చి.. ఒక్కసారిగా ఇలా..!
Comments
Please login to add a commentAdd a comment