సీపీఎం రాష్ట్ర కార్యదర్శి - తమ్మినేని వీరభద్రం
సాక్షి, ఖమ్మం: చట్టసభల్లో ప్రజాసమస్యలపై గళం వినిపించేది కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని తెలిపారు.
జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాన్ని సాధించేలా తాను సీపీఎం జిల్లా కార్యదర్శిగా పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఖమ్మం నుండి తాను గెలవగా.. ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆ తర్వాత ప్రాజెక్టు పేర్లు, డిజైన్ మారినా... ప్రాజెక్టుకు మూలం మాత్రం సీపీఎం అని స్పష్టం చేశారు.
జిల్లాకు పరిశ్రమల సాధన, కోల్‌బెల్ట్ సమస్యలు, భద్రాచలం అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై కమ్యూనిస్టు శాసనసభ్యులు క్రియాశీలకంగా పోరాడి చట్టసభల్లో గళమెత్తారని వెల్లడించారు. కాగా, జిల్లాలో సీపీఎంకు ఒక్క సీటు కూడా ఇవ్వని పార్టీలతో పొత్తు ఎలా పెట్టుకోవాలని తమ్మినేని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనించి వామపక్షాలు, సామాజిక శక్తులు, బీఎస్‌పీ అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథాతో చర్చలు జరుగుతున్నందున ఒకటి, రెండో రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని తమ్మినేని తెలిపారు.
ఇవి చదవండి: వీరి ఓట్లే.. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయి!
Comments
Please login to add a commentAdd a comment