గాలివాన బీభత్సం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలంగా వీచిన ఈదురుగాలులతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా, భారీవృక్షాలు నేలకూలాయి. ఖమ్మం నగరంతో పాటు, కూసుమంచి, తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, పెనుబల్లి, వైరా, కొణిజర్ల, ముదిగొండ తదితర మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. అలాగే, ఈదురుగాలుల కారణంగా తీగలు తెగి పడడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రఘునాథపాలెంలో 51.5 మి.మీ. వర్షపాతం
రఘునాథపాలెం మండల కేంద్రంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఇక్కడ గరిష్టంగా 51.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, ముదిగొండలో 37.3, పెనుబల్లిలో 36.5, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 36.3, ఖమ్మం ఖానాపురంలో 34, తిరుమలాయపాలెంలో 33, పమ్మిలో 24, రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలో 23.5, తల్లాడలో 23, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో 20 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. నాలుగురోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా బుధవారం అత్యధికంగా 41.7 సెల్సియస్ డిగ్రీ లుగా నమోదైంది. ఈక్రమాన సాయంత్రం వర్షం కురవడంతో భానుడు శాంతించే అవకాశముంది. ఇక ఈ వర్షం వరి, మిరప, ఉద్యాన పంటలకు ప్రయోజకరంగా ఉన్నా.. పత్తి నాణ్యతను దెబ్బతీస్తుందని రైతులు చెబుతున్నారు.
●ఖమ్మంమయూరిసెంటర్/వైరా రూరల్/నేలకొండపల్లి/పెనుబల్లి: ఈదురు గాలులు, వర్షంతో ఖమ్మం 25వ డివిజన్‌లో ఉన్న పురాతన భారీ మర్రిచెట్టు నేలకొరిగింది. పక్కనే ఉన్న పురాతన భావి, ఇతర గోడలపై పడడంతో సమీప ప్రాంతాన ఉన్న ఇళ్లలోని వారు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కేఎంసీ డీఆర్‌ఎఫ్ సిబ్బంది చేరుకుని చెట్టకొమ్మలను తొలగించడంలో నిమగ్నమయ్యారు. అలాగే, వైరా మండలం గొల్లపూడి–పాలడుగు మధ్య ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన ఉన్న భారీ వృక్షం వైరా–జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై కూలింది. దీంతో ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు చేరుకుని గన్నవరం వైపు నుండి పంపించి ట్రాఫిక్ మళ్లించారు. ఇక నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిలో పెద్దపాక రవికి చెందిన పాడి గేదైపె చెట్టు కూలడంతో గాయపడింది. అలాగే, పలువురు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. అనాసాగారం శివార్లలో చెట్టు కూలి రోడ్డుపై అడ్డంగా పడగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెనుబల్లి మండలం కేంద్రంలో పలు కూడా పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. వీఎం బంజర్ రింగ్ సెంటర్ వద్ద రహదారిపై 3నుంచి 4 అడుగుల మేర వరద ప్రవహించింది. పలుప్రాంతాల్లో విద్యుత్తు సరపరా నిలిచిపోవడంతో ఉద్యోగులు మరమ్మతులు చేపట్టారు.
పలుచోట్ల ఎగిరిపడిన ఇళ్ల పైకప్పులు
రహదారులపై కూలిన భారీ వృక్షాలు
రాకపోకలకు అంతరాయం..
నిలిచిన విద్యుత్ సరఫరా
Comments
Please login to add a commentAdd a comment