కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను మంగళవారం రాత్రి విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలో 304ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల డిగ్రీ కళాశాలలు ఉండగా, ఇందులో 121 ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు వివిధ రకాల ఫీజులు బకాయి పడ్డారు. దీంతో ఆయా కాలేజీల ఫలితాలను యూనివర్సిటీ అధికారులు నిలిపివేశారు. డిగ్రీ మొద టి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యే సమయాన్ని ఫీజు చెల్లించాల్సి ఉన్నా కళాశాలల యాజమాన్యాల బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిని కలిసి సమయం కోరారు. దీంతో 15 – 20 రోజుల గడువు ఇచ్చినా చెల్లించకపోగా జవాబుపత్రాల మూల్యాంకనం సమయంలో నోటీసులు పంపారు. దీంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు చెల్లించినా ఇంకా 121 కళాశాలల బాధ్యులు స్పందించలేదు. ఈమేరకు ఆయా కళాశాలల్లో విద్యార్థుల ఫలితాలను వెల్లడించలేదు. ఈమేరకు విద్యార్థులు ఆందోళనకు గురవుతుండగా, యాజమాన్యాల బాధ్యులు బుధవారం రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిస్తే ఆయన వీసీ దృష్టికి తీసుకెళ్తానని బదులిచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ వివరణ కోరగా ఫీజులు చెల్లిస్తేనే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment