సస్యశ్యామలం
ఇకపై ఉమ్మడి జిల్లా
జూలూరుపాడు: సీతారామ ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ కాల్వ నుంచి రాజీవ్ కెనాల్‌లోకి గోదావరి జలాలను ఆయన బుధవారం రాత్రి 9 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు పూజలు చేసి చీర, సారె సమర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన సమావేశంలో తుమ్మల మాట్లాడారు.
రూ.100 కోట్లు మంజూరు చేయించా..
గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా మూడు పంప్ హౌస్‌లను నిర్మించినా నిరుపయోగంగా ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. సీతా రామ ప్రాజెక్ట్ డిజైన్‌లో ఏన్కూర్ రాజీవ్ లింక్ కెనాల్ లేకున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలం వచ్చినప్పుడు ఒప్పించి రూ.100 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు. ఈ కాల్వ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, వారిని ఒప్పించిన రెండు జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులతో చకచకా పూర్తయిందని తెలిపారు. కాగా, తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజలు, రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేశానని వివరించారు. సీతమ్మ సాగర్ నిర్మాణం పూర్తయితే 36 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చని, గోదావరి – కృష్ణా జలాల అనుసంధానంతో సాగర్ ఆయకట్టులో 1.80 లక్షల ఎకరాలను స్థిరీకరించవచ్చని వెల్లడించారు. కాగా, సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కింద నాలుగో పంప్ హౌస్‌ను అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈమేరకు కెనాల్‌కు భూమలు ఇచ్చిన రైతులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితేష్ వి.పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్‌నాయక్, డాక్టర్ మట్టా రాగమయి, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బొర్రా రాజశేఖర్, లేళ్ల వెంకటరెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, రాధాకిషోర్, మాలోత్ మంగీలాల్ నాయక్, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, తహసీల్దార్ స్వాతి బిందు, ఇరిగేషన్ అధికారులు శ్రీనివాసరెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
100 కి.మీ. ప్రయాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం వద్ద గోదావరి నదిపై కాటన్ నిర్మించిన ఆనకట్ట నుంచి నీరు ఎత్తిపోసేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. ఈ పథకంలో భాగంగా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు, ములకలపల్లి మండలంలోని వీ.కే.రామవరం, కమలాపురంలలో పంప్‌హౌస్‌లు నిర్మించి మోటార్లు అమర్చారు. అలాగే, ఇప్పటివరకు 100 కి.మీ. మేర కాల్వల తవ్వకం పూర్తయింది. పంప్‌హౌస్‌ల్లో మోటార్లను మూడు రోజులుగా నడిపిస్తుండగా గోదావరి జలాలు బుధవారం సాయంత్రం వరకు జూలూరుపాడు మండలం నల్లబండబోడు వద్దకు చేరాయి. ఈసందర్భంగా పెద్దసంఖ్యలో హాజరైన గ్రామస్తులతో కలిసి వైరా ఎమ్మెల్యే రాందాస్ గోదావరి జలాలకు పూజలు చేశారు. అక్కడి నుంచి సీతారామ మెయిన్ కెనాల్ ద్వారా వినోభానగర్ వద్దకు రాత్రికల్లా జలాలు చేరుకున్నాయి. ఆపై కొత్తగా నిర్మించిన రాజీవ్ కెనాల్‌లోకి నీటిని మంత్రి తుమ్మల విడుదల చేశారు. అనంతరం ఏన్కూరు మండలం అక్కినాపురం తండా 52వ కి.మీ. వద్ద ఎన్నెస్పీ(నాగార్జునసాగర్ ప్రాజెక్టు) కాల్వలోకి బుధవారం అర్ధరాత్రి దాటాక చేరాయి.
లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎన్నెస్పీ ఆయకట్టుకు అందించేలా ఏన్కూరు లింక్ కెనాల్(రాజీవ్ కెనాల్) నిర్మాణం చేపట్టారు. తద్వారా జూలూరుపాడు, ఏన్కూరు మండలాల్లో 7,500 ఎకరాలు, వైరా రిజర్వాయర్‌తో పాటు సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో 1.20 లక్షల ఎన్నెస్పీ ఆయకట్టు గోదావరి జలాలతో స్థిరీకరణ జరగనుంది.
‘సీతారామ’ ద్వారా ఎన్నెస్పీ
ఆయకట్టుకు గోదావరి జలాలు
మెయిన్ కెనాల్ నుంచి
రాజీవ్ లింక్ కెనాల్‌లోకి విడుదల
పూజలు చేసి మాట్లాడిన
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఎనిమిది గంటల పాటు ఎత్తిపోత
అశ్వాపురం: అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ ఫేస్ –1 పంప్‌హౌస్ నుంచి మూడో రోజైన బుధవారం కూడా గోదావరి జలాలను ఎత్తిపోశారు. పంప్‌హౌస్‌లోని ఒక మోటార్ ద్వారా ఎనిమిది గంటల పాటు 86.4 ఎంసీఎఫ్‌టీ నీటిని దిగువకు విడుదల చేశారు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి మూడు పంప్‌హౌస్‌ల ద్వారా ఏన్కూరు లింక్ కెనాల్‌కు, అక్కడి నుంచి ఎన్నెస్పీ కెనాల్‌కు గోదావరి జలాలు చేరుతున్నాయి.
సస్యశ్యామలం
సస్యశ్యామలం
సస్యశ్యామలం
Comments
Please login to add a commentAdd a comment