మీరు మా అతిథులు! | - | Sakshi
Sakshi News home page

మీరు మా అతిథులు!

Published Thu, Mar 6 2025 12:30 AM | Last Updated on Thu, Mar 6 2025 12:31 AM

మీరు

మీరు మా అతిథులు!

ఖమ్మం సహకారనగర్‌: కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం జరిగే గ్రీవెన్స్‌ డేతో పాటు ఇతర రోజుల్లో వచ్చే దివ్యాంగులను తాము అతిథులుగా భావిస్తామని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన బుధవారం అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 40రోజుల క్రితం ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థన మేరకు జిల్లా అధికారులతో చర్చించి ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. రానున్న మూడు నెలల్లో ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ కార్డు అందేలా చూస్తామని, అప్పటివరకు సదరం సర్టిఫికెట్‌ నంబర్‌ ఆధారంగా టోకెన్లు ఇస్తామని చెప్పారు. కాగా, దివ్యాంగుల సంక్షేమానికి అన్ని చర్యలు చేపడుతూ వారికి ఏ సమస్యా రాకుండా చూస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తొలిరోజు 300మందికి...

అన్నంతో పాటు పప్పు, సాంబారు, కాకరకాయ ఫ్రై, టమాటా కూర, క్యాలిఫ్లవర్‌ చట్నీతో తొలిరోజు భోజనాన్ని సమకూర్చారు. ఈ మెనూ ప్రతిరోజు మారుతుందని నిర్వాహకులు తెలిపారు. తొలిరోజు 300కిపైగా దివ్యాంగులు భోజనం చేయగా, కలెక్టర్‌ చొరవను పలువురు అభినందించారు.

దివ్యాంగులకు ఏ సమస్య రానివ్వం

కలెక్టరేట్‌లో ఉచిత భోజనాన్ని

ప్రారంభించిన కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌

ప్రతీ తహసీల్‌లో హెల్ప్‌డెస్క్‌

దివ్యాంగులు గౌరవప్రదమైన జీవనం గడిపేలా ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందిస్తామని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం యూనిక్‌ డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డు(యూడీఐడీ) పొందే విధానంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మిస్తుండగా, ప్రతీ తహసీల్‌లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానం ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకంలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్‌ శ్రీజ, డీఆర్వో ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీడబ్ల్యూఓ కె.రాంగోపాల్‌రెడ్డి, డీఈఓ సోమశేఖరశర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇంట్లో భోజనంలా ఉంది...

కలెక్టరేట్‌లో మాకు ఉచిత భోజనం సమకూర్చడం బాగుంది. ఉచితమైనా నాణ్యమైన భోజనం సమకూర్చడంతో ఇంట్లో తిన్నామనే సంతృప్తి కలిగింది. కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ చొరవతో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తుండడం ఆనందంగా ఉంది.

– కొత్తూరి వెంకటాచారి, నేలకొండపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
మీరు మా అతిథులు!1
1/2

మీరు మా అతిథులు!

మీరు మా అతిథులు!2
2/2

మీరు మా అతిథులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement