పుణే.. నమూనా
● అక్కడ ఎస్టీపీలతో సమర్థంగా మురుగునీటి నిర్వహణ ● యూజీడీలతో మెరుగుపడిన పారిశుద్ధ్యం ● అధ్యయనం చేస్తున్న కేఎంసీ బృందం
ఖమ్మంమయూరిసెంటర్: నగరాలు, పట్టణాల అభివృద్ధితో పాటే పారిశుద్ధ్య సమస్య సైతం పెరుగుతుంటుంది. విస్తరిస్తున్న కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, వీధుల్లోని ఖాళీ స్థలాలు, లోతట్టు ప్రాంతాల్లోకి మురుగు చేరుతుండడం.. డ్రెయినేజీలు ఉన్న చోట మురుగు వెళ్లి నదులు, చెరువుల్లోకి చేరి కలుషితం కావడం సాధారణంగా మారింది. ఈనేపథ్యాన ఎస్టీపీ(మురుగు నీరు శుద్ధీకరణ ప్లాంట్)లు ఏర్పాటుచేస్తే జల వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. ఈక్రమాన దేశంలోనే పారిశుద్ధ్య నిర్వహణలో మేటిగా నిలుస్తున్న పుణే మహానగరంలో మురుగు నీటి శుద్ధీకరణకు పెద్దసంఖ్యలో ఎస్టీపీలు ఏర్పాటుచేశారు. అక్కడ రోజుకు 500 ఎంఎల్‌డీ మురుగు నీటిని శుద్ధి చేసే 10 ప్లాంట్లు నిర్వహణలో ఉండగా, మరో 11 సిద్ధమవుతున్నాయి. వీటి ద్వారా పుణే మధ్యలో ప్రవహించే మూలముత్త నదిలో కలిసే మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు. ఈమేరకు పుణేలో మురుగునీటి నిర్వహణ, ఇతర అంశాలపై అధ్యయానికి వెళ్లిన ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు వీటిని పరిశీలిస్తున్నారు.
యూజీడీలు, ఎస్టీపీల మీదుగా నదిలోకి..
కేఎంసీ కార్పొరేటర్లు, అధికారుల బృందం గురువారం పుణేలోని మూలముత్త నదిని పరిశీలించారు. మూల, ముత్త నదుల సంగమంగా ఏర్పడిన ఈ నది నగరం మీదుగా ప్రవహిస్తోంది. అయితే, డ్రెయినేజీల ద్వారా మురుగునీరు ఇందులోకి చేరుతుండడంతో ప్రజలు, పర్యావరణ వేత్తల ఆందోళనతో మహానగర పాలక సంస్థ ఆధ్వర్యాన ఎస్టీపీలను ఏర్పాటు చేశారు. తద్వారా మురుగునీరు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ)ల్లోకి చేరి ఆపై ఎస్టీపీల ద్వారా శుద్ధి అయ్యాక నదిలో కలుస్తోంది. ఇలాంటి విధానాన్నే ఖమ్మంలోనూ అమలుచేయాలనే భావనకు కేఎంసీ పాలకవర్గం, అధికారులు వచ్చారు. ప్రస్తుతం ఖమ్మం శ్రీనివాసనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్టీపీని పూర్తి చేస్తే కొంత మేర మురుగు నీరు మున్నేరులో కలవకుండా అడ్డుకట్ట పడుతుందని.. ఆపై కొత్తగా మంజూరైన మరో నాలుగు ప్లాంట్లను ప్రధాన చెరువుల వద్ద ఏర్పాటు చేస్తే నగరంలోని మురుగునీటి శుద్ధి జరుగుతుందనే భావనకు వచ్చారు. అంతేకాక ఖమ్మం నగరమంతా యూజీడీ నిర్మిస్తేనే మురుగునీరు శుద్ధికి వీలవుతుందనే చర్చ కూడా జరిగింది.
అతిపెద్ద ఎస్టీపీ
పుణే నగరంలో 500 ఎంఎల్‌డీ మురుగు నీటిని శుద్ది చేసేందుకు 10 ఎస్టీపీలు నిర్మించారు. ఇందులో అతి పెద్దదైన డాక్టర్ నాయుడు మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను రూ.40 కోట్ల వ్యయంతో పది ఎకరాల్లో నిర్మించారు. ఈ ప్లాంట్ రోజుకు 115 మినియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తుండడం విశేషం.
తొలి రోజుంతా పరిశీలన, సమావేశాలు
కేఎంసీ బృందం తమ పర్యటనలో తొలిరోజైన గురువారం పుణేలోని మూలముత్త నదితో పాటు ఎస్టీపీలను పరిశీలించారు. అనంతరం అక్కడి మహానగర పాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించగా కౌన్సిల్ హాల్ అసెంబ్లీ హాల్‌ను తలపించేలా ఉండడంతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పుణే మహానగర పాలకసంస్థ అడిషనల్ కమిషనర్ పృధ్వీరాజ్, అధికారులతో ఖమ్మం మేయర్ నీరజ, కార్పొరేటర్లు, అధికారులు సమావేశం కాగా, అక్కడ పారి శుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రెవెన్యూ, పరి పాలన తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈక్రమంలో మేయర్ నీరజ, అసిస్టెంట్ కమిషనర్ షఫీ ఉల్లా అహ్మద్, కార్పొరేటర్లు పలుఅంశాలు తెలుసుకున్నారు. ఈఈ కృష్ణాలాల్, ఏఓ శివలింగం, టీపీఎస్ సంతోష్, ఏఈలు తేజ్, యాకూబ్ వలీ పాల్గొన్నారు.
కీలకంగా మూలముత్త నది
కేఎంసీ బృందం పర్యటనలో మూలముత్త నది కీలకంగా నిలిచింది. ఈ నది పుణే నగరంలో 44 కి.మీ. మేర ప్రవహిస్తోంది. నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,700 కోట్లు కేటాయించింది. దీనికి తోడు అక్కడి నగర పాలక సంస్థ ఆధ్వర్యాన ఇరువైపులా 5 కి.మీ. అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కరకట్ట వెంట మొక్కలు నాటడం, కట్టపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల ఏర్పాటు, ప్రతీ 300 మీటర్లకు ఒక ఘాట్ నిర్మాణం జరుగుతుండగా.. ఖమ్మంలో మున్నేరునూ ఇదే తరహాలో అభివృద్ధి చేస్తే నగరం మరింత ఆకర్షణీయంగా మారుతుందనే ఆలోచనకు కేఎంసీ బృందం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment