కృష్ణమ్మ ఒడిలోకి గోదావరి
● ఎన్నెస్పీ కెనాల్‌లో కలిసిన గోదావరి జలాలు ● లింక్ కెనాల్‌కు భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో పరిహారం ● అటు జలం, ఇటు పరిహారంతో రైతుల్లో ఆనందం
ఏన్కూరు: ఏన్నో ఏళ్లుగా రైతులు, సామాన్య ప్రజానీకం ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. మూడు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయగా ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మీదుగా జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపానికి బుధవారం రాత్రి 9.30 గంటలకు చేరుకున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏన్కూర్ లింక్ కెనాల్‌లోకి గోదావరి జలాలు విడుదల చేయగా, 8.6 కి.మీ. పొడవైన కెనాల్‌లో ప్రవహించిన గోదావరి నీరు గురువారం తెల్లవారుజాము కల్లా ఏన్కూరులోని ఎన్నెస్పీ కెనాల్ 52 కి.మీ. రెగ్యులేటర్ వద్దకు చేరడంతో కృష్ణా – గోదావరి సంగమం ఆవిష్కృతమైంది.
సాగుకు సమస్య లేనట్లే...
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కోసం జిల్లాలో కెనాళ్లు నిర్మించగా లక్షల ఎకరాల్లో ఆయకట్టు సాగువుతోంది. అయితే, కృష్ణా పరీవాహకంలో వర్షాలు కురవని సమయంలో సాగర్‌లో నీటి లభ్యత లేక సాగుకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యాన సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసే నీటిని ఎన్నెస్పీ కాల్వల్లోకి మళ్లించాలనే ఆలోచనతో జూలూరుపాడు మండలం వినోభానగర్ వరకు పూర్తయిన ప్రధాన కాల్వ నుంచి ఏన్కూరులోని ఎన్సెస్పీ కెనాల్ వరకు 8.6 కి.మీ. లింక్ కెనాల్‌ను రూ.96కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ కాల్వ నిర్మాణం పూర్తికావడంతో గోదావరి జలాలను విడుదల చేయగా ఎన్పెస్పీ కెనాల్‌లోకి చేరాయి. ఆపై ఎస్కేప్ లాక్‌ల ద్వారా వైరా రిజర్వాయర్‌కు మళ్లిస్తున్నారు. దీంతో సాగర్ ఆయకట్టు, సాగర్ జలాలపై ఆధారపడిన వైరా రిజర్వాయర్ కింద ఆయకట్టుతో పాటు సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సైతం పంటల సాగుకు ఢోకా ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
194 మందికి పరిహారం
సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ నిర్మాణానికి రైతుల నుంచి 139.6 ఎకరాల భూమి సేకరించారు. ఈమేరకు 205 మంది రైతులకు ఎకరాకు రూ.14లక్షల పరిహారం చెల్లిస్తామని తొలుత ప్రకటించారు. ఇందుకు రైతులు ససేమిరా అన్నప్పటికీ పనులు పూర్తిచేశారు. అయితే, కాల్వ పనులను పరిశీలనకు పలుమార్లు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభానికి ముందే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి నీటి విడుదలకు కొద్ది గంటల ముందు ఎకరాకు రూ.21లక్షల పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం 194 మంది రైతుల ఖాతాల్లో పరిహారం జమ కాగా, మిగతా వారికి ఒకటి, రెండు రోజుల్లో అందుతాయని అధికారులు తెలిపారు.
చాలా ఆనందంగా ఉంది.
చాన్నాళ్లుగా పరిహారం కోసం ఎదురుచూశాం. తొలుత ఎకరానికి రూ.14లక్షలే ఇస్తామన్నారు. మా పోరాట ఫలితంగా రూ.21లక్షల చొప్పున జమ చేశారు. కాల్వ నిర్మాణానికి మా భూమి 28 గుంటలు కోల్పోయాం. ఈ భూమికి పరిహారం అందడమే కాక నీరు విడుదల చేయడం సంతోషంగా ఉంది. – భూక్యా కిషన్, రైతు హిమాం నగర్
కృష్ణమ్మ ఒడిలోకి గోదావరి
Comments
Please login to add a commentAdd a comment