ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం మొదలయ్యాయి. ఈ పరీక్షకు 17,262 మందికి గాను 16,855 మంది విద్యార్థులు హాజరుకాగా, 407 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని 42 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ బృందాలు తనిఖీ చేశాయని డీఐఈఓ రవిబాబు వెల్లడించారు.
చేనేత, టెక్స్‌టైల్స్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు
ఖమ్మంగాంధీచౌక్: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిస్టూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)కి మూడేళ్ల కాలపరిమితితో చేనేత, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ కోర్సు మంజూరైందని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు ఎం.విజయలక్ష్మి తెలిపారు. ఈ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 1నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే 23 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలైతే 25ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్న వారు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో ఏప్రిల్ మొదటి వారంలోగా దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 90300 79242 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
యథావిధిగానే
రైళ్ల రాకపోకలు
ఖమ్మం రాపర్తినగర్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడో లైన్ నిర్మాణం జరుగుతుండగా శుక్రవారం నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నామని, ఇంకొన్ని దారి మళ్లిస్తామని అధికారులు ఇటీవల ప్రకటించారు. కానీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ, శుక్రవారం నుంచి అన్ని రైళ్లు యథావిధిగానే నడుస్తాయని గురువారం మరో ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈమేరకు ప్రయాణికులు గమనించాలని ఖమ్మం కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎం.డీ.జాఫర్ కోరారు.
శ్రీరామనవమి లోగా
రహదారి మరమ్మతులు
ఖమ్మంవన్‌టౌన్: ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్ నుండి కరుణగిరి వరకు రోడ్డు, డివైడర్లు దెబ్బతిన్నందున శ్రీరామనవమి లోగా మరమ్మతులు పూర్తిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి పెద్దసంఖ్యలో భక్తులు రానున్నందున ఆలోగా మరమ్మతులు చేపట్టడమే కాక నిర్మాణం పూర్తయిన డివైడర్లు, సర్కిళ్లలో మొక్కలు నాటి పెయిటింగ్ వేయించాలని సూచించారు. ఇప్పటికే కూడళ్ల ఆధునికీకరణపై హైదరాబాద్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి కృష్ణ పరిశీలించినందున ఇతర పనులు పూర్తయ్యేలా ఖమ్మం కలెక్టర్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకోవాలని మంత్రి తెలిపారు.
మూడు బీసీ హాస్టళ్ల
భవనాలకు నిధులు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో శిథిలావస్థ కు చేరిన బీసీ సంక్షేమ వసతిగృహాల భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలకు అనుమతి మంజూరైంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదనలతో ఖమ్మంలో మూడు బీసీ వెల్ఫేర్ హాస్టల్ భవనాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో భవనానికి రూ.3 కోట్ల చొప్పున రూ.9 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో రఘునాథపాలెం మండలం వి.వెంకటాయ పాలెంలో బీసీ బాలుర హాస్టల్, ఖమ్మం ముస్తఫానగర్‌లోని బీసీ బాలుర హాస్టల్–1, జహీర్‌పురలోని బీసీ బాలుర హాస్టల్–2కు అన్ని హంగులతో నూతన భవనాలు నిర్మించనున్నారు.
ఎడమ కాల్వకు
నీటి విడుదల నిలిపివేత
కూసుమంచి: పాలేరు రిజర్వాయర్ నుండి ఎడ మ కాల్వకు గురువారం సాయంత్రం నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. రిజర్వాయర్ నీటిమట్టాన్ని పెంచేందుకు గాను రెండు రోజుల పాటు సరఫరా ఉండదని తెలిపారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 16 అడుగులు ఉండగా, సాగర్ నుండి 5,738 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎడమ కాల్వకు 3,546 క్యూసెక్కులు, పాలేరు కాల్వకు 230 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ప్రాజెక్టుకు 135 క్యూసెక్కులు, భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి మరో 275 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తు తం ఎడమ కాల్వకు సరఫరా నిలిపివేయగా, రిజర్వాయర్ నీటిమట్టం 20 అడుగులకు చేరాక తిరిగి విడుదలచేస్తామని అధికారులు తెలిపారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment