
అతిథులకు ఆహ్వానం..
భద్రాచలం: ఏజెన్సీ అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు, రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్వానం పలికేందుకు భద్రాచలంలో గిరిజన మ్యూజియం సిద్ధమవుతోంది. చిన్నారులను ఆటపాటలతో అలరించనుంది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు వీక్షకులకు తెలిసేలా రూపుదిద్దుకుంటోంది. భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
శరవేగంగా పనులు..
భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియంలో ఆదివాసీల దుస్తులు, పనిముట్లు, వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా మ్యూజియం ప్రాంగణంలో ‘గిరిజన పల్లె’తరహాలో వెదురు, మట్టి నిర్మాణాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చిన్నారుల ఆట పాటలకు బొమ్మలతో పార్క్, ఓపెన్ జిమ్ సిద్ధం చేశారు. చిన్నారులు పెడల్ బోటింగ్ చేసేందుకు పాండ్ రూపొందించారు. యువత, పెద్దలకు బీచ్ తరహాలో ‘ఇసుక వాలీబాల్’, బాక్స్ క్రికెట్, షెటిల్ కోర్టులను సిద్ధం చేస్తున్నారు. వీటి పనులు శరవేగంగా సాగుతుండగా, గిరిజన వంటకాలతో స్టాల్స్, గిరిజన ఉత్పత్తులు, వస్తువుల స్టాల్స్‌ను సైతం రెడీ చేస్తున్నారు.
శ్రీరామనవమిలోగా అందుబాటులోకి..
ముక్కోటి నాటికి గిరిజన పల్లె పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ కలెక్టర్, పీఓ సూచనల మేరకు ఎంటర్‌టైన్‌మెంట్ కల్పించేలా మరికొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెడల్ బోటింగ్, ఓపెన్ జిమ్, పార్క్‌లను సిద్ధం చేశారు. వచ్చే నెల 6న శ్రీరామనవమి జరగనున్న నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ లోపు అన్ని పనులు పూర్తి చేయాలని పీఓ ఆదేశాలు జారీ చేశారు. ఈసారి శ్రీరామనవమికి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆధ్యాత్మికతతోపాటు ఆట పాటలతో వినోదం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భద్రాచలంలో ఆధ్యాత్మికతతోపాటు వినోదం
ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్న
గిరిజన మ్యూజియం ఆవరణ
ఐటీడీఏ ప్రాంగణంలో పార్క్, ఓపెన్ జిమ్ పూర్తి
ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, పీఓ

అతిథులకు ఆహ్వానం..

అతిథులకు ఆహ్వానం..
Comments
Please login to add a commentAdd a comment