మారితే.. మనం ఎటు?!
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్‌లో 2008లో జరిగిన పునర్విభజనతో నియోజకవర్గాల రూపురేఖలు, రిజర్వేషన్లు మారిపోయాయి. కొన్ని స్థానాలు జనరల్ నుంచి రిజర్వ్‌లోకి, రిజర్వ్‌డ్‌గా ఉన్న స్థానాలు కొన్ని జనరల్‌కు మారాయి. అలాగే, తొమ్మిదిగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పదికి చేరింది. ఇక వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి పునర్విభజన చేపట్టేలా కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే, 2026 తర్వాత జనాభా లెక్కల అనంతరమే
నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చట్ట సవరణ చేయగా.. ఇప్పడు ఈ ప్రక్రియపై ఎందుకు కసరత్తు జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం
రెండుగా ఖమ్మం..
ఈసారి చేపట్టనున్న డీలిమిటేషన్ విధి విధానాలు ఇప్పటివరకై తే బయటకు రాలేదు. ఒక్కో నియోజకవర్గానికి ఎంత మంది జనాభాను పరిగణనలోకి తీసుకుంటారో తేలాల్సి ఉంది. అయితే, డీ లిమిటేషన్ చేపడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి జిల్లాలో 2001 జనాభా లెక్కలతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. గత పునర్విభజన సమయాన కొత్తగా అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుత జనాభాను పరిశీలిస్తే ఈసారి పునర్విభజనలో ఒక్క నియోజకవర్గమైనా పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం జనాభా పరంగా రెట్టింపు అయినందున ఈ నియోజకవర్గం రెండుగా ఏర్పడే అవకాశమున్నట్లు చర్చ
జరుగుతోంది.
ఇప్పుడే ఎందుకు?
పెరుగుతున్న జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంటారు. తద్వారా నియోజకవర్గాల సంఖ్య పెరగడమే కాక సరిహద్దులు మారుతుంటాయి. ఇందుకోసం తొలిసారిగా 1963లో డీ లిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నియోజకవర్గాల సరిహద్దులు, రిజర్వేషన్లు నిర్ణయిస్తుంది. చివరిసారి 2008లో 2001 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టారు. ఆ సమయంలోనే 84వ చట్ట సవరణ ద్వారా 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా మరోమారు పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యాన ఇప్పుడు పునర్విభజనకు సిద్ధం కావడాన్ని కొన్ని పార్టీలు తప్పుపడుతున్నాయి.
మారిన రిజర్వేషన్లు..
2008లో చేపట్టిన డీలిమిటేషన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల పరిధి, రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. తద్వారా కొందరు నేతలకు ఇబ్బంది ఎదురుకాగా, మరికొందరికి కలిసొచ్చింది. అప్పటి వరకు తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా అశ్వారావుపేట ఏర్పాటైంది. ఇందులో అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు చేరాయి. రాష్ట్ర విభజన తర్వాత కుక్కునూరు, వేలేరుపాడు ఏపీలోకి వెళ్లగా.. ఇక్కడ కొత్తగా అన్నపురెడ్డిపల్లి మండలం చేరింది. ఇక బూర్గంపాడు నియోజకవర్గం రద్దయి ఆ స్థానంలో పినపాక చేరింది. అంతేకాక జనరల్ నియోజకవర్గమైన సుజాతనగర్ రద్దు కాగా.. ఆ స్థానంలో ఎస్టీ రిజర్వ్‌డ్‌గా వైరా నియోజకవర్గం ఏర్పడింది. అలాగే సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలు జనరల్ నుంచి ఎస్సీ రిజర్వ్‌కు, ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న పాలేరు జనరల్ కేటగిరీలోకి వచ్చింది. ఈ క్రమంలో జనరల్ కేటగిరీలో కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు మాత్రమే మిగిలాయి.
ఏం చేద్దాం.. ఎలా వెళ్దాం
నియోజకవర్గాల పునర్విభజన చర్చ మొదలవడంపై రాజకీయ పార్టీల నాయకులు దృష్టి సారించారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే తమకు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న మండలాలు ఇతర నియోజకవర్గంలో కలిసే అవకాశం ఉందా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అయితే నియోజకవర్గానికి ఎంత జనాభా ఉండాలనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ఇంకొందరు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను మూడు జనరల్‌గా ఉన్నాయి. ఈసారి పునర్విభజనపై పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో రిజర్వ్ స్థానాలు తగ్గుతాయా, పెరుగుతాయా.. రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయా, స్థానాల సంఖ్య పెరుగుతుందా అన్న అంశంపై అయోమయం నెలకొంది. కాగా, గత పునర్విభజన సమయాన కీలక నేతలు కొందరు సిట్టింగ్ స్థానాలు వదిలి ఇతరచోట్ల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. సుజాతనగర్ నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరుకు వెళ్లగా, పాలేరులో పోటీ చేసి పలుమార్లు గెలిచిన సంభాని చంద్రశేఖర్, ఒకసారి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లికి, సత్తుపల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు సైతం తమ కార్యక్షేత్రాన్ని మార్చా రు. ఈసారీ ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయా అన్న అనుమానాలు నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పునర్విభజనపై పార్టీల్లో చర్చ
చివరిగా 2008లో
స్థానాల పునర్విభజన
అప్పుడు తొమ్మిది నుంచి
10కి పెరిగిన అసెంబ్లీ సీట్లు
రిజర్వేషన్లలోనూ మార్పులు
ఈసారి పెంపు, రిజర్వేషన్లపై
సర్వత్రా ఉత్కంఠ
మారితే.. మనం ఎటు?!
Comments
Please login to add a commentAdd a comment