పచ్చని పంట.. పుదీనా!
తల్లాడ: వాణిజ్య పంటలకు రూ.లక్షల్లో పెట్టుబడి పెడుతున్నా సరైన దిగుబడి రాక రైతులు నష్టపోతున్న ఈ తరుణంలో తల్లాడ మండలం మంగాపురంలో ఒక రైతు మొదలుపెట్టిన పుదీనా సాగు మరికొందరు అదే బాట పట్టేలా స్ఫూర్తినిచ్చింది. దీంతో ఆ గ్రామం పుదీనానే కాక ఇతర ఆకు, కూరల సాగులోనూ మేటిగా నిలుస్తోంది.
ఐదేళ్ల క్రితం ప్రారంభం..
మంగాపురానికి చెందిన రైతు గాదె నరసింహారావు ఐదేళ్ల క్రితం పుదీనా సాగు మొదలుపెట్టాడు. ఈ పంటతో ఆయన లాభాలు గడిస్తుండగా మరికొందరూ అదే బాట పడుతున్నారు. కాగా, నర్సింహరావు నాలుగున్నర ఎకరాల్లో పుదీనా సాగు చేసి డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీరందిస్తున్నాడు. పుదీనాకు తోడు కాకర, దోసకాయ, టమాటా పంటలను కూడా సాగు చేస్తుండగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఒకసారి డ్రిప్ ద్వారా నీరు వదిలితే పంటతా తడుస్తుండడంతో పర్యవేక్షించాల్సిన భారం కూడా తప్పిందని చెబుతున్నారు. పుదీనాతో పాటు గ్రామ రైతులు పాలకూర, తోటకూర, టమాట, దోసకాయ, వంకాయ, బెండకాయ, బీరకాయ వంటి పంటలను కూడా పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అంటుకట్టే పద్ధతిలో..
పుదీనా సాగులో రైతులు అంటు కట్టే విధానం అవలంబిస్తున్నారు. మొదట అంటుకట్టి నీరు పెడితే రెండు నెలలకు పుదీనా కోతకొస్తోంది. ఆపై మళ్లీ డ్రిప్ ద్వారా నీరు పెట్టుకుంటూ కలుపు తీసి పోషణ చేసుకుంటే 45 రోజుల్లో రెండో కోత వస్తుందని చెబుతున్నారు. ఆపై మళ్లీ నీటి సరఫరాతో ఇంకో 45 రోజులకు.. ఇలా 20 కోతల వరకూ పుదీనా తీసుకోవచ్చని రైతులు చెబుతున్నారు.
ప్రతీనెల ఆదాయం..
ఓ రైతు నాలుగున్నర ఎకరాల్లో పుదీనా సాగు చేస్తే ఎకరానికి రూ.లక్ష చొప్పున పెట్టుబడి అవసరమవుతుంది. ఆపై అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50 వేల లాభం వస్తుందని చెబుతున్నారు. చీడపీడలు తక్కువ కావడం.. వైరా మార్కెట్‌లో హోల్‌సేల్ వ్యాపారులు కట్ట రూ.6కు తీసుకుంటుండడం.. తరచుగా ఖమ్మం, కొత్తగూడెంలోనూ అమ్ముతుండడంతో రైతులకు నికర లాభం వస్తోందని చెబుతున్నారు. దీనికి తోడు ఎకరానికి పది మంది కూలీలు పుదీనా కోసి కట్టలు కట్టాల్సి ఉంటుంది. దీంతో ఒక రైతు సాగు చేసే తోటలోనే 30 మంది వరకు కూలీలు అవసరం అవుతుండడంతో స్థానికంగా కూలీలకు నిత్యం రూ.400 చొప్పున అందుతున్నాయి.
మంగాపురంలో విస్తృతంగా సాగు
రైతులకు నికర ఆదాయం..
కూలీలకూ ఉపాధి
డ్రిప్ విధానంలో వేసవిలోనూ
ఆశాజనకంగా దిగుబడి
ఒకసారి అంటుకడితే 20 సార్లు..
ప్రతీనెల పుదీనా సాగుతో ఖర్చులు పోగా రూ.50వేల వరకు మిగులుతున్నాయి. నిత్య పరిశీలనకు తోడు ఓసారి అంటు కట్టి నీరు పెడుతుంటే 20 సార్లయినా పుదీనా తీసుకోవచ్చు. చీడపీడలు తక్కువే కాగా, కలుపు పెరగకుండా చూసుకుంటే చాలు.
– గాదె నరసింహారావు, రైతు, మంగాపురం
అందరికీ అందుబాటులో...
మా గ్రామ రైతులు పుదీనా సాగు చేస్తుండడంతో ఎప్పుడు కావాలన్నా తాజాగా లభిస్తోంది. వివాహాది శుభకార్యాల సమయాన ఇబ్బంది ఉండడం లేదు. మార్కెట్‌కు వెళ్లే పని లేకుండానే ఫోన్‌లో చెబితే చాలు నేరుగా ఇంటికే తెచ్చి ఇస్తున్నారు.
– పరుచూరి సతీష్, మంగాపురం
పచ్చని పంట.. పుదీనా!
పచ్చని పంట.. పుదీనా!
పచ్చని పంట.. పుదీనా!
Comments
Please login to add a commentAdd a comment