ఎండల వేళ.. మామిడి జాగ్రత్త
● బిందు సేద్యంతో తోటలకు నీరు అందిస్తే మేలు ● ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి మధుసూదన్
ఖమ్మంవ్యవసాయం: రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యాన మామిడి తోటల రక్షణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా, ఖమ్మం జిల్లాలో 30 వేలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. ప్రస్తుతం మామిడి కాయ దశలో ఉండడం.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున పంటను రక్షించుకుంటూ నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు రైతులు తగిన యాజమాన్య పద్ధతలు పాటించాలని ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఎం.వీ.మధుసూదన్ సూచించారు. ఈమేరకు జిలాల్లోని పలు ప్రాంతాల్లో తోటలను పరిశీలించిన రైతులకు ఆయన చేసిన సూచనలు ఇలా ఉన్నాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
● ప్రతీ మొక్కకు 6 – 8 డ్రిప్పర్లతో రోజుకు మూడు గంటలు చొప్పున బిందు సేద్యం ద్వారా నీరు అందించాలి.
● ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున నేలలో తేమ సమతుల్యతను కాపాడేందుకు ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర నీరు పెట్టాలి.
● డ్రిప్పర్లు చెట్టు కాండం నుండి 1.5 మీటర్ల దూరంలో ఉండాలి. డ్రిప్పర్ స్థానాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
● కాయ సైజు వేగంగా పెరిగేందుకు పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన చెట్లకు 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
● త్రిప్స్(రసం పిల్చే చీడపీడలు) కనిపిస్తే లీటర్ నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.
● వాతావరణ మార్పు ప్రభావాలను తగ్గించడానికి మామిడి తోటకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీరు పట్టడమే ప్రధానం.
● సాధారణంగా మామిడి తోటల వ్యాపారులు తక్కువ నీరు పెడుతుంటారు. లేదా రోజు విడిచి రోజు నీరు ఇస్తారు. తద్వారా పండ్లు రాలిపోయే ప్రమాదమున్నందున జాగ్రత్తలు వహించాలి.
Comments
Please login to add a commentAdd a comment