
సమయం ఆసన్నం
వచ్చేనెల 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ
● జిల్లాలో 4,11,428 రేషన్‌కార్డులు.. 11.21 లక్షల మంది లబ్ధిదారులు ● గోదాముల్లో 85,735.446 మెట్రిక్ టన్నుల బియ్యం సిద్ధం ● జిల్లాలో ఏడాదికి సరిపడా నిల్వలు
సన్నధాన్యం సాగుపై దృష్టి..
ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో సన్న ధాన్యం సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రణాళిక రూపొందించింది. సన్న రకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించింది. దీంతో రైతులు ఎక్కువగా ఈ ధాన్యం సాగువైపే మొగ్గు చూపారు. జిల్లాలో మొత్తం 2,81,991 ఎకరాల్లో వరి సాగు చేయగా.. అందులో 2,62,230 ఎకరాల్లో సన్న రకం ధాన్యమే పండించారు. 19,761 ఎకరాల్లో దొడ్డు రకాలు సాగయ్యాయి. పౌర సరఫరాల సంస్థ 344 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 47,494 మంది రైతుల నుంచి సన్న ధాన్యాన్ని సేకరించింది. దొడ్డు వడ్లను కూడా కొనుగోలు చేసిన అధికారులు.. ఈ రెండు రకాలను వేర్వేరుగా నిల్వ చేశారు. సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లర్లకు అందజేశారు.
మిల్లింగ్‌కు 2.81 లక్షల మెట్రిక్ టన్నులు..
జిల్లాలో 2,81,440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం మిల్లర్లకు అందించింది. ఈ ధాన్యానికి సంబంధించి 1,88,574.680 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా రేషన్ దుకాణాలకు అందించే సన్న బియ్యానికి సంబంధించి 2,52,563 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు చేరింది. వారి నుంచి సీఎంఆర్ కింద 1,69,217.21 మెట్రిక్ టన్నుల బియ్యం చేరాల్సి ఉండగా ఇప్పటి వరకు 85,735.446 మెట్రిక్ టన్నుల బియ్యం పౌర సరఫరాల సంస్థకు చేరాయి. ఇంకా 83,481.764 మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉంది. వచ్చిన సన్న బియ్యాన్ని జిల్లాలోని తొమ్మిది గోదాముల్లో నిల్వ చేశారు.
ఈ ఏడాది ఢోకా లేనట్టే..
రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఈ ఏడాది సన్న బియ్యం పుష్కలంగా అందుబాటులో ఉండనున్నాయి. జిల్లాలో 4,11,428 కార్డులు ఉండగా.. 11,21,049 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలకు మొత్తం 7,230.750 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం అవసరం.
ఏడాదికి మొత్తం 86,769 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అయితే ఇప్పటి వరకు సీఎంఆర్ కింద 85,735.446 మెట్రిక్ టన్నుల బియ్యం పౌర సరఫరాల సంస్థకు చేరగా, గోదాముల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి ప్రతినెలా మండల స్టాక్ పాయింట్లకు చేరుతాయి.
ఇప్పటికే ఏడాదికి సరపడా సన్న బియ్యం స్టాక్ ఉన్నాయి. మిల్లర్ల నుంచి ఇంకా 83,481.764 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. ఈ మొత్తం కూడా పౌరసరఫరాల సంస్థకు చేరితే.. ఏడాదికి సరిపడా రేషన్ దుకాణాలకు అందుబాటులో ఉంటాయి.