ఖమ్మంవైద్యవిభాగం : నగరంలోని ప్రసూన ఆస్పత్రిలో లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదివారం విచారణ చేపట్టారు. ఆ ఆస్పత్రిలో అపరేషన్ అనంతరం సరోజని(62) అనే మహిళను అపరేషన్ థియేటర్ నుంచి లిఫ్ట్ ద్వారా తరలించే క్రమంలో స్ట్రెచర్ పైనే ప్రాణాలు విడిచిన విషయం విదితమే. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ నిమిత్తం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సైదులు విచారణ నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై సిబ్బందితో ఆరా తీశారు. సాంకేతిక లోపంతో లిఫ్ట్ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు డాక్టర్ సైదులు తెలిపారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి నివేదించనున్నట్లు వివరించారు. ఆస్పత్రిలో లిఫ్ట్ స్థితిగతులు, కంపెనీ వివరాలు, ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు, ఇంతకుముందు ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై నివేదిక సమర్పించాలని ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి నివేదిక వచ్చాక యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.