ఇందిరమ్మకు అడుగులు | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మకు అడుగులు

Mar 25 2025 12:11 AM | Updated on Mar 25 2025 12:10 AM

ఇళ్ల నిర్మాణాలు పరిశీలన

తిరుమలాయపాలెం: మండలంలో పైలట్‌ గ్రామంగా ఎంపికై న ఏలువారిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఎంపీడీఓ సిలార్‌సాహెబ్‌కు సూచించారు. ఆతర్వాత తిరుమలాయపాలెం, పిండిప్రోలులో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం పటిష్టంగా అమలుచేసేలా అడుగులు పడుతున్నాయి. గత జనవరి 26న గ్రామసభలు నిర్వహించిన 20గ్రామపంచాయతీల్లో పలువురికి ఇళ్లు మంజూరు చేశారు. అందులో కొన్ని బేస్‌మెంట్‌ స్థాయికి చేరగా.. మిగిలిన పంచాయతీల్లో లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు ఖమ్మం కార్పొరేషన్‌, సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఎల్‌–1జాబితాపై రీ వెరిఫికేషన్‌ కొనసాగుతోంది. ఇందులో అర్హులను గుర్తించి కలెక్టర్‌కు పంపించాక ఎంపిక పూర్తి చేయనున్నారు.

850 ఇళ్లు మంజూరు..

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను ఈ ఏడాది జనవరి 26న ప్రారంభించింది. అందులో భాగంగా అదేరోజు గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రకటించారు. జిల్లాలోని 20 గ్రామపంచాయతీలకు సంబంధించి ఎంపీడీఓలు 1,017 మందిని ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా తేల్చగా, అందులో 962 దరఖాస్తులను కలెక్టర్‌ ఆమోదించారు. ఆపై 112 దరఖాస్తులను తొలగించి చివరగా 850 మందిని ఎంపిక చేశారు. ఇందులో 470 ఇళ్లకు సంబంధించి జియో ట్యాగ్‌ చేయగా, మరో 49 ఇళ్లు పునాదిదశలో ఉన్నాయి. ఇంకో 44 దరఖాస్తులను ఎంపీడీఓలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది.

మోడల్‌హౌస్‌ల నిర్మాణం

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా మోడల్‌హౌస్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. ప్రభుత్వం మంజూరు చేసే రూ.5లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా చేపట్టవచ్చో తెలియచేయడమే వీటి లక్ష్యం. పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో మోడల్‌హౌస్‌ నిర్మాణం పూర్తి కాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఇక్కడ 400 చదరపు అడుగుల స్థలంలో హాల్‌, కిచెన్‌, అటాచ్డ్‌ బాత్‌రూమ్‌తో ఇల్లు నిర్మించారు. ఇంటిలోపల గదులు, వరండాల్లో టైల్స్‌ వేయడమే కాక డాబా మెట్ల కింద టాయిలెట్‌ నిర్మించారు. ఇంట్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ఫ్యాన్లు, ఇంటికి రంగులు అన్నింటినీ రూ.5లక్షల్లోనే పూర్తి చేశారు.

మూడు కేటగిరీలుగా ఇళ్లు..

ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడు కేటగిరీలుగా విభజించారు. సొంత జాగా ఉండి గుడిసె, రేకులషెడ్‌, టైల్స్‌ వేసిన, అద్దె ఇళ్లలో ఉండేవారిని ఎల్‌–1(లిస్ట్‌)గా గుర్తించారు. అదే గుడిసె, రేకులషెడ్‌, టైల్స్‌ వేసిన ఇళ్లు, అద్దె ఇళ్లలో ఉంటూ స్థలం కూడా లేని వారిని ఎల్‌–2కేటగిరీగా, ఇళ్లు ఉండి.. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన తమకు ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్‌–3 కేటగిరీగా విభజించారు. ఈ కేటగిరీల వారీగా వివిధ దశల్లో ఇళ్ల మంజూరు జరగనుంది. అయితే, ఎల్‌–1 జాబితాలో వారికే మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

జాబితాల రీ వెరిఫికేషన్‌

ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల్లో ఎల్‌–1 కేటగిరీలో లబ్ధిదారులు 60,747 మంది దరఖాస్తులను పునః పరిశీలన చేస్తున్నారు. ఈ ప్రక్రియ అటు జీపీలు, ఇటు కేఎంసీ, మున్సిపాలిటీల్లోనూ కొనసాగుతోంది. ఇక్కడ కూడా కేటగిరీల వారీగానే లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. రీ వెరిఫికేషన్‌ తర్వాత అర్హుల జాబితాను కలెక్టర్‌కు పంపిస్తారు. ఆపై ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి పరిశీలించి.. దశల వారీగా ఇళ్లు మంజూరు చేయనున్నారు.

పైలట్‌గా 20 జీపీల్లో

850 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ఆ గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభం

మిగతా ప్రాంతాల్లో ఎల్‌–1 జాబితా పునఃపరిశీలన

దశల వారీగా త్వరలోనే

ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నాం..

ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం రీవెరిఫికేషన్‌ కొనసాగుతోంది. జీపీలు, మున్సిపాలిటీల్లో వచ్చిన దరఖాస్తులను యంత్రాంగం పరిశీలించాక ఎందరు లబ్ధిదారులో తేలుతుంది. ఆపై జాబితాను కలెక్టర్‌కు అప్పగిస్తే ఎంపిక పూర్తవుతుంది. జిల్లాలో మొదటి విడతగా జనవరి 26న మంజూరు చేసిన 850 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.

– భూక్యా శ్రీనివాస్‌, పీడీ, గృహ నిర్మాణ శాఖ

ఇందిరమ్మకు అడుగులు1
1/2

ఇందిరమ్మకు అడుగులు

ఇందిరమ్మకు అడుగులు2
2/2

ఇందిరమ్మకు అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement