ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు నిబంధనలు అమలుపై వివరాలు అందజేయాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సైదులు ఆదేశించారు. ఆస్పత్రుల్లో లిఫ్ట్‌ల పనితీరు, వాటి కొనుగోలు బిల్లులు, నిర్వహణ సమాచారంతో పాటు అగ్నిమాపక శాఖ నిబంధనల అమలుపై వివరాలు సమర్పించాలని సూచించారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లిఫ్ట్ తీగ తెగి మహిళ మృతి చెందిన నేపథ్యాన వైద్య, ఆరోగ్య శాఖ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
పెద్దాస్పత్రి మార్చురీకి
అదనంగా ఫ్రీజర్లు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మార్చురీకి నాలుగు కొత్త ఫ్రీజర్లు చేరాయి. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తన నిధుల నుంచి వీటిని కేటాయించారు. మార్చురీలో ప్రస్తుతం ఉన్న ఫ్రీజర్లు నాలుగు తరచూ మొరాయిస్తుండటంతో మృతదేహాల భద్రత కష్టమవుతోంది. పలుమార్లు మార్చురీ నుండి దుర్గంధం వెదజల్లుతోంది. ఇటీవల పెద్దాస్పత్రికి ఎంపీ వచ్చినప్పుడు ప్రీజర్ల పరిస్ధితిని అధికారులు వివరించగా సోమవారం నాలుగు ఫ్రీజర్లను పంపించారు.
ఖేలో ఇండియా
పోటీల్లో కాంస్యం
ఖమ్మం స్పోర్ట్స్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా జాతీయస్థాయి సీనియర్ మహిళల ఉషూ టోర్నీలో ఖమ్మంకు చెందిన పి.పవిత్రాచారి కాంస్య పతకం సాధించింది. ఈనెల 20నుంచి 23వ తేదీ వరకు కొనసాగిన టోర్నీలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమె, నుదిటిపై గాయమైనా పట్టు వదలకుండా నాన్‌దావో ఈవెంట్‌లో ప్రతిభ కనబర్చింది. కాగా, ఖేలో ఇండియా పోటీలో వరుసగా మూడేళ్ల నుంచి పవిత్ర పతకం సాధిస్తుండడం విశేషం. ఈసందర్భంగా ఆమెతో పాటు కోచ్ పరిపూర్ణాచారిని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తదితరులు అభినందించారు.
ప్రశాంతంగా
ఎస్సెస్సీ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈమేరకు సోమవారం 97 పరీక్ష కేంద్రాల్లో 16,376 మందికి గాను 16,344మంది హాజరు కాగా 32మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీజ ఒక కేంద్రం, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రెండు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 38 కేంద్రాలను తనిఖీ చేయగా తాను ఆరు కేంద్రాల్లో పరిశీలించానని వెల్లడించారు.
●నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం, సింగారెడ్డిపాలెంలో పదో తరగతి పరీక్షల కేంద్రాలను డీఈఓ సోమవారం తనిఖీ చేసి మాట్లాడారు. ఎక్కడ పొరపాట్లు జరగకుండా నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించేలా డీఓలు, సీఎస్‌లకు సూచనలు చేస్తున్నట్లు తెలి పారు. ఎంఈఓ బి.చలపతిరావు పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల వివరాలు సమర్పించండి