● ఖమ్మంలో ‘యంగ్ ఇండియా స్కూల్’ నిర్మాణంపై మల్లగుల్లాలు ● గతంలోనే శంకుస్థాపన చేసినా మొదలుకాని పనులు ● ప్రత్యామ్నాయ స్థలం కోసం అధికారుల అన్వేషణ
రఘునాథపాలెం: ఖమ్మం నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రతీ నియోజకవర్గానికి ఒక స్కూల్‌ను మంజూరు చేయగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి రఘునాథపాలెం మండలంలోని జింకలతండా క్రాస్ సమీపాన సర్వే నంబర్ 20లో ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈమేరకు అక్టోబర్ 11న మంత్రులు శంకుస్థాపన కూడా చేశారు. అయితే, ఇటీవల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడి భూమి భవన నిర్మాణానికి అనువుగా లేదని, గుంతలు, గుట్టలతో నిండి ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయని నివేదిక సమర్పించారు. ప్రత్యామ్నాయ భూమిని కేటాయిస్తేనే పనులు మొదలుపెడతామని స్పష్టం చేయడంతో అధికారులు అనువైన స్థలం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. కాగా, స్కూల్‌కు తొలుత కేటాయించిన భూమిలో గుట్ట ఉండడంతో అక్కడ గ్రావెల్ కోసం తవ్వకాలు జరిగాయి. అయితే, తవ్వకాలు సమాంతరంగా కాక ఇష్టారాజ్యంగా చేపట్టడంతో కొన్నిచోట్ల పెద్ద గుంతలు, మరికొంత భాగం గుట్టలు, బండరాళ్లతో మిగిలిపోయింది. ఈనేపథ్యాన స్కూల్ భవన నిర్మాణానికి అనువుగా లేదని తేల్చడంతో ప్రత్యామ్నాయంగా 25నుంచి 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందోనని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
కలెక్టర్ పరిశీలన
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అనువైన భూమి కోసం అన్వేషణ మొదలుపెట్టిన అధికారులు పలుచోట్ల భూములను గుర్తించినట్లు తెలిసింది. ఈమేరకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, ఆర్డీఓ జి.నర్సింహారావు, తహసీల్దార్ విల్సన్‌బెన్నీ సోమవారం పరిశీలించారు. శివాయిగూడెం వద్ద సర్వే నంబర్ 266, రఘునాథపాలెం బైపాస్‌లో మెడికల్ కాలేజీకి కేటాయించిన భూమికి సమీపంలో స్థలాలను పరిశీలించి వివరాలు ఆరా తీశారు. రెసిడెన్షియల్ స్కూల్‌కు ఎక్కడ భూమి ఖరారు చేస్తారో త్వరలోనే తేలే అవకాశముంది.
ఆ స్థలం అనువుగా లేదు...