● చెట్టును కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి ● పావు గంటలో ఇంటికి చేరతారనగా ఘటన
ఖమ్మంరూరల్: ఆ ముగ్గురూ స్నేహితులు. ఒకే రంగంలో కొనసాగుతుండడంతో ఎక్కడికై నా కలిసి వెళ్లడం ఆనవాయితీ. ఈ క్రమాన శ్రీశైలంలో దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అయితే, యాత్ర ఆసాంతం సాఫీగా జరిగి ఇంకో పావుగంటలో ఇంటికి చేరతామనగా ఈ ప్రమాదం జరగడంతో రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
జేసీబీల వ్యాపారం...
ఖమ్మం నగరం దానవాయిగూడెంకు చెందిన పల్లపు రాము(46), కేతం కృష్ణమూర్తి(47), బండారి సురేష్ స్నేహితులు. వీరు ముగ్గురు జేసీబీల వ్యాపారంలో కొనసాగుతున్నారు. శ్రీశైలంలో స్వామి దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న వీరు ఈనెల 22న కారులో బయలుదేరారు. అక్కడ దైవదర్శనం అనంతరం ఆదివారం తిరుగుముఖం పట్టారు. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి ఇంకో పావు గంట అయితే ఇంటికి చేరతామనగా ఆటోనగర్ సమీపాన ఎదురుగా వస్తున్న ఇంకో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో వీరి కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ సమయాన కారును సురేష్ నడుపుతున్నాడు. ఈ ప్రమాదంలో రాము తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తిని స్థానికులు 108లో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా సోమవారం ఉదయం కన్నుమూశాడు. ఇక సురేష్‌కు కూడా గాయాలు కాగా చికిత్స అందిస్తున్నారు. అయితే, కారు అతివేగంతో వెళ్తుండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై రాము భార్య రేణుక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం