ఏన్కూరు: అటవీ జంతువులను వేటాడేందుకు వెళ్లిన యువకుడు విద్యుదాఘాతంలో మృతి చెందిన ఘటన ఏన్కూరు మండలం నెమలిపురి సమీపాన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కారేపల్లి మండలం చీమలపాడుకు చెందిన మేకల కరుణాకర్(18) వద్దకు అదే గ్రామానికి చెందిన జక్కుల రాములు, జక్కుల ప్రవీణ్ సాయంత్రం వచ్చి వేటకు తీసుకెళ్లారు. అయితే, రాత్రి 9–30 గంటలకు జక్కుల రాములు, జక్కుల ప్రవీణ్ కలిసి కరుణాకర్ ఇంటికి వచ్చి ఆయన విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు కుటుంబీకులకు తెలిపారు. దీంతో ఘటనాస్థలికి వెళ్లి చూడగా కరుణాకర్ మృతదేహం, సమీపాన విద్యుత్ తీగలు కనిపించాయి. అయితే, వీరు వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తాకడంతో మృతి చెందాడా, అప్పటికే ఇతరులు అమర్చిన తీగలతో ప్రమాదం జరిగిందా అనేది తెలియరాలేదు. ఘటనపై కరుణాకర్ తండ్రి కోటయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రఫీ తెలిపారు.