సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారుల సతమతం
● మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ● 31వ తేదీతో ముగియనున్న ఫీజు గడువు
నాటి దరఖాస్తులకే..
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు 2020 ఆగస్ట్ 26కు ముందు రూ.వెయ్యి కట్టిన వారు ఫీజు చెల్లించేందుకు కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఒకేసారి దరఖాస్తుదారుల సంఖ్య పెరగడంతో సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి. దరఖాస్తుల స్థితిని తెలుసుకునేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా 99,913 దరఖాస్తులు ఉండగా.. 61,343దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించాయి. ఇందులో 5,731 మంది దరఖాస్తుదారులే ఫీజు చెల్లించారు.
ఐజీఆర్‌ఎస్ అయోమయం
ఫీజు చెల్లించాలని మెసేజ్‌లు రాకపోవడంతో పలువురు కార్యాలయాలకు వచ్చి ఆరా తీస్తున్నారు. వీరి దరఖాస్తు నంబర్ల ఆధారంగా ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే ‘ఐజీఆర్‌ఎస్’(ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ అండ్ స్టాంప్స్) అనే మెసేజ్ చూపిస్తోంది. ఇదేమిటంటే.. ఐజీఆర్‌ఎస్‌లో ఉన్న దరఖాస్తులకు ఫీజు చెల్లించాలనే మెసేజ్ రాదని.. ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్థల వాల్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చి అటాచ్ చేస్తే ఎంత ఫీజు చెల్లించాలనే మెసేజ్ రావొచ్చని పేర్కొంటున్నారు.
అన్నీ ఉన్నా ఆ జాబితాలో..
ప్రభుత్వ స్థలాలు, ఇరిగేషన్ స్థలాలకు సంబంధించిన సర్వే నంబర్లలో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం ప్రొహిబిటెడ్(నిషేధిత జాబితా) కింద చేర్చింది. వీటిని రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తే ప్రొహిబిటెడ్ వర్తిస్తుందా, లేదా అన్నది తేలనుంది. ఈ దరఖాస్తులను పరిశీలించాలంటే ఇంకొంత సమయం పడుతుంది. క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని సమాచారం. అన్ని పత్రాలతో ఎల్‌ఆర్‌ఎస్‌కి దరఖాస్తు చేసుకున్నా తమది నిషేధిత జాబితాలో ఎందుకు పడిందని కొందరు హెల్ప్‌డెస్క్‌ల వద్ద సిబ్బందిని నిలదీస్తున్నారు.
నత్తనడకనే చెల్లింపులు
ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు సత్తుపల్లి, మధిర,వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో ఫీజు చెల్లింపునకు 30,813 దరఖాస్తులు అర్హత సాధించాయి. ఇందులో 4,163 మందే రూ.22.42కోట్ల మేర ఫీజు చెల్లించగా, 2,416 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇక సుడా పరిధిలో 19,070 దరఖాస్తులు అర్హత సాధిస్తే రూ.3.85కోట్ల ఫీజు చెల్లించిన 1,357 మందిలో 80 దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి రూ.3.85 కోట్లు చెల్లించారు. ఇక జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఫీజు చెల్లించేందుకు 11,460 దరఖాస్తులు అర్హత సాధించగా.. 211 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. అంతా సాఫీగా ఉన్న దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.
ఎల్‌ఆర్‌ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) చిక్కులమయంగా మారింది. ఫీజు చెల్లిస్తే ప్రక్రియ పూర్తవుతుందని భావించిన దరఖాస్తుదారులను సాంకేతిక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. సాంకేతిక లోపాలతో సర్వర్లు మొరాయిస్తుండగా.. ఫీజు గడువు ఈనెల 31తో ముగియనుండడం వారి ఆందోళనకు కారణమవుతోంది. కొందరికి ఫీజు చెల్లించాలనే సమాచారం రాకపోవడంతో కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే ఐజీఆర్‌ఎస్ అని వస్తోంది. ఇంకొందరి స్థలాలు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారం ఎలాగో తెలియక అధికారులు.. ఎప్పుడు మెసేజ్ వస్తుందోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మరికొద్ది రోజులు గడువు పెంచితే తప్ప జిల్లాలో ఉన్న దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం లేదని చెబుతున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
ఐజీఆర్‌ఎస్ అని వస్తోంది..
ఖమ్మం ఇల్లెందు రోడ్డులో ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ పక్కన ఉన్న స్థలానికి ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2020లో దరఖాస్తు చేశా. నగదు చెల్లిద్దామని చూస్తే ఐజీఆర్‌ఎస్ అని వస్తోంది. కార్పొరేషన్ ఽఅధికారులను అడిగితే ఏం చేయలేమంటున్నారు. దరఖాస్తు చేసుకునే సమయాన అన్ని పత్రాలు సమర్పించా. ప్రతిరోజు మెసేజ్ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నా.
– గోపినేని శ్రీధర్‌రావు, బుర్హాన్‌పురం, ఖమ్మం
ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు
ప్రాంతం దరఖాస్తులు పెండింగ్ ప్రొహిబిటెడ్
ఖమ్మం కార్పొరేషన్ 39,999 16,388 5,550
వైరా మున్సిపాలిటీ 3,524 751 –
మధిర 4,280 147 146
ఏదులాపురం 13,496 10,002 269
సత్తుపల్లి 3,688 88 77
సుడా 20,759 2,145 740
జీపీలు 14,167 2,208 696
మొత్తం 99,913 31,729 7,478
ఎల్‌ఆర్‌ఎస్.. అన్నా చిక్కులే
ఎల్‌ఆర్‌ఎస్.. అన్నా చిక్కులే
ఎల్‌ఆర్‌ఎస్.. అన్నా చిక్కులే