ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో సికిల్‌సెల్‌తో బాధపడుతున్న వారి వివరాలు సేకరించి దివ్యాంగులుగా సర్టిఫికెట్లు(యూడీఐడీ కార్డులు)జారీ అయ్యేలా చేడాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల వైద్యులు, లాబ్ టెక్నీషియన్లు, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఉపాధ్యాయులకు మంగళవారం ఖమ్మంలో సికిల్‌సెల్ అనీమియాపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా వారసత్వంగా వచ్చే జన్యుపరమైన రక్త రుగ్మత అని తెలిపారు. ఇప్పటివరకు 87,448 మంది గిరిజనులకు పరీక్షలు చేయగా వ్యాధి ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నామన్నారు. వీరికి సదరమ్ సర్టిఫికెట్(యూనిక్ డిజేబిలిటీ ఐడెంటీ కార్డ్) జారీ చేయనున్నట్లుతెలిపారు. అనంతరం సికిల్‌సెల్ నోడల్ ఆఫీసర్ వెంకటరమణ,అదనపు డీఎంహెచ్‌ఓ సైదులు, ప్రోగ్రాం అధికారులు చందునాయక్, రామారావు మాట్లాడగా స్టేట్ సికిల్ సెల్ ట్రెయినర్లు మధువరన్, గణేష్‌నాయక్ సర్వే చేయాల్సి తీరు, వ్యాధి లక్షణాలను వివరించారు. వివిధ విభాగాల ఉద్యోగులు ఎస్.సుబ్రహ్మణ్యం, సాంబశివరెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మంలో తెరుచుకున్న మధ్య గేట్
ఖమ్మం రాపర్తినగర్: మూడో రైల్వే లైన్ పనుల కారణంగా నెలల తరబడి మూసి ఉంటున్న ఖమ్మంలోని రైల్వే మధ్య గేట్ ఎట్టకేలకు తెరుచుకుంది. నెలలుగా గేట్ మూసి ఉండడంతో జిల్లా కేంద్రంలో ప్రధానమైన గాంధీచౌక్, కమాన్ బజార్ మధ్య వ్యాపార లావాదేవీలు మందగించాయి. అలాగే, ప్రజల రాకపోకలకు ఇక్కట్లు ఎదురయ్యాయి. దీంతో సమస్యను ఎంపీ రవిచంద్ర ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. గేట్ తెరిపించడమే కాక శాశ్వత పరిష్కారానికి బ్రిడ్జి నిర్మించాలని కోరారు. దీంతో అండర్ పాస్ మంజూరుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించిన మంత్రి.. ఆలోగా గేటు తెరవాలని ఆదేశించారు. దీంతో గేట్ తెరిచి మంగళవారం నుంచి రాకపోకలకు అనుమతించడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సికిల్‌సెల్ బాధితులకు యూడీఐడీ కార్డులు