నేలకొండపల్లి: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో వంద శాతం పన్నుల వసూలు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పి.ఆశాలత తెలిపారు. నేలకొండపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేసిన ఆమె రికార్డులను పరిశీలించాక మాట్లాడారు. జిల్లాలోని 579 జీపీల్లో రూ.15.80 కోట్ల పన్నుల డిమాండ్ ఉండగా.. రూ.14 కోట్లకు పైగా(89శాతం) వసూలయ్యాయని తెలిపారు. మొత్తంగా 280 జీపీల్లో నూరు శాతం పన్నులు వసూలవడంతో ఈనెలాఖరు నాటికి వంద శాతం లక్ష్యం సాధిస్తామని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వ భవనాలకు నోటీసులు అందించి వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా కంచెలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. తొలుత డీపీఓ కార్యాలయంలో ఈఓ చాంబర్‌కు రాగా, కుర్చీలకు దుమ్ము పట్టి ఉండడంతో కార్యాలయ నిర్వహణ ఇలాగేనా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ శుభ్రం చేయించారు. ఎంపీఓ సీ.హెచ్.శివ, పంచాయతీరాజ్ డీఈఈ వంశీ తదితరులు పాల్గొన్నారు.