● అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ● జిల్లాలో ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ ప్రారంభం
కామేపల్లి: ఆడపిల్ల పుట్టడాన్ని అదృష్టంగా భావించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అభినందించేలా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ పేరిట ఈ కార్యక్రమం ద్వారా అమ్మాయి పుట్టిన దంపతులను జిల్లా యంత్రాంగం తరఫున సన్మానించడంతో స్వీట్ బాక్స్, ప్రశంసాపత్రం ఇవ్వాలని సూచించారు. ఆడపిల్ల జన్మోతవ వేడుకల పేరిట రూపొందించిన ఈ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించగా కామేపల్లి మండలం జాస్తిపల్లిలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామానికి చెందిన శివరాత్రి నాగమణి–సాయిరాం దంపతులకు ఇటీవల ఆడపిల్ల జన్మించగా వారిని సన్మానించి స్వీట్లు అందజేశాక ఆమె మాట్లాడారు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్న ఆడపిల్లను భారంగా భావించొద్దని, మగపిల్లలతో సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి మధుసూదన్‌రావు, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రవీందర్, ఐసీడీఎస్ సీడీపీఓ దయామణి, సూపర్‌వైజర్ కృష్ణకుమారి పాల్గొన్నారు.
●కారేపల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ వారికి క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఆమె తరగతి గదులు, వంటశాలను పరిశీలించి సౌకర్యాలపై విద్యార్థులతో మాట్లాడారు. పలువురు విద్యార్థుల దుస్తులు, కటింగ్, వ్యక్తిగత పరిశుభ్రతపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, వార్డెన్లను మందలించారు. ఎంపీఓ రవీంద్రప్రసాద్ పాల్గొన్నారు.
●ఎర్రుపాలెం: మండలంలోని చొప్పకట్లపాలెం, బనిగండ్లపాడు, ఎర్రుపాలెంల్లో జెడ్పీ సీఈఓ దీక్షారైనా పర్యటించారు. చొప్పకట్లపాలెంలో ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించి మాట్లాడారు. ఆతర్వాత బనిగండ్లపాడు పీహెచ్‌సీని తనిఖీ చేయగా, మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్, గురుకులంలో పదో తరగతి పరీక్ష కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఐసీడీఎస్ సీడీపీఓ కృష్ణశ్రీ, ఎంపీడీఓ సురేందర్, ఎంఈఓ బి.మురళీమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అమ్మాయి పుట్టడం.. అదృష్టం